పవన్ కల్యాణ్ .. అలీ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ఈ కారణంగానే పవన్ సినిమాల్లో అలీకి తప్పకుండా ఒక పాత్ర ఉంటుంది. అయితే ఇటీవల వచ్చిన 'అజ్ఞాతవాసి' సినిమాలో అలీ నటించలేదు. దాంతో పవన్ . . అలీ మధ్య మనస్పర్థలు వచ్చాయనీ .. అందువల్లనే ఆ సినిమాను అలీ చేయలేదనే ప్రచారం జోరుగా జరిగింది. ఇందుకు సంబంధించిన ప్రశ్న అలీకి తాజా ఇంటర్వ్యూలో ఎదురైంది.

 అందుకాయన స్పందిస్తూ .. " పవన్ హీరో కాకముందు నుంచే మా ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆయన తొలి సినిమాలో నేను చేయలేదు .. అలాగే 'అజ్ఞాతవాసి'లోను చేయలేదు. మిగతా అన్ని సినిమాల్లో నేను ఉన్నప్పటికీ మా ఇద్దరి మధ్య గొడవైందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. నిజమే మా ఇద్దరికీ గొడవైంది .. అదీ 'ఇవాంకా ట్రంప్' విషయంలో అంటూ నవ్వేశారు. అసలు పవన్ తో నాకు గొడవేముంటుంది? మొన్న జరిగిన పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి కూడా ఆయన నన్ను పిలిచారు.. నేను వెళ్లాను" అంటూ ఈ విషయంలో జోరుగా జరుగుతోన్న ప్రచారానికి ఆయన అడ్డుకట్ట వేశారు.