తెలంగాణ గద్దర్ ఫిల్మ్అవార్డు వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమపై కఠినంగా ఉండటానికి కారణం ఏంటో చెప్పారు.
టాలీవుడ్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా ఉండటానికి కారణమేంటో తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. పలు కామెంట్లని కూడా చేసింది.
అవార్డుల విషయంలో, చిత్ర పరిశ్రమ సమస్యల విషయంలో ఇండస్ట్రీ నుంచి పెద్దగా స్పందన లేదని ఓ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. కొందరు సెలబ్రిటీలపై కఠినంగానూ వ్యవహరించాల్సి వచ్చింది. అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన విషయంలో ఇండస్ట్రీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వార్‌లా నడిచింది.
సినీ కళాకారులను గౌరవించడం కోసం 1964లో నంది అవార్డులు ప్రారంభం
ఈ క్రమంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులు 2024 ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని హైటెక్స్ లో గ్రాండ్‌గా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
పలువురుకి అవార్డులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1964ల ప్రభుత్వం నంది అవార్డులను ప్రారంభించారని, సినిమా దర్శకులు, నిర్మాతలు, కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఈ పురస్కారాలను ప్రారంభించారని, దానికి నంది అవార్డులు అని పేరు పెట్టినట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.
గద్దర్ ఫిల్మ్ అవార్డులు ప్రారంభం వెనుక కథ
అయితే కొన్ని కారణాలతో 14ఏళ్లుగా ఈ అవార్డులు ఆగిపోయానని, తిరిగి ఈ అవార్డులు ప్రారంభించాలని ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు కమిటీ ప్రపోజల్ తీసుకొచ్చిందన్నారు. మళ్లీ ఈ అవార్డులను అందించాలనప్పుడు ప్రజా కళాకారుడు గద్దర్ పేరుతో అందించడం సరైనదని భావించి ఆ పేరు పెట్టినట్టు చెప్పారు రేవంత్ రెడ్డి.
తెలుగు చిత్ర పరిశ్రమ ఆర్టిస్ట్ లు, డైరెక్టర్లు, ఇతర కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో అవార్డులను మళ్లీ ప్రారంభించినట్టు తెలిపారు. తమని అభినందిస్తున్న ప్రభుత్వానికి సపోర్ట్ గా నిలుస్తూ, అవార్డులను స్వాగతిస్తూ వచ్చిన సినిమా పెద్దలు, కళాకారులు అందరికి ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.
భారత్ గర్వించే స్థాయిలో తెలుగు చిత్ర పరిశ్రమ
ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్ వైపు చూసేవారు, తెలుగు సినిమా అంటే మద్రాస్ వైపు చూసేవారు, కానీ ఇప్పుడు టాలీవుడ్ దేశం గర్వించే స్థాయికి ఎదిగింది. భారత సినిమాని ప్రతిబింబిస్తుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటితరం హీరోలుగా ఎన్టీఆర్, ఏఎన్నార్ రాణించారు.
ఆ తర్వాత రెండో తరంగా కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి వారు రాణించారు. మూడో తరంగా చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి వారు మెప్పించారు. ఇప్పుడు నాలుగో తరంగా ప్రభాస్, పవన్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి వారు రాణిస్తున్నారు.
చిత్ర పరిశ్రమపై ప్రభుత్వం కఠినంగా ఉండింది అందుకే
ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమకి ఒక్క విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం చిత్ర పరిశ్రమ విషయంలో పైకి కఠినంగా కనిపించినా, అది ఇండస్ట్రీని ప్రోత్సహించే ఉద్దేశ్యమే తప్ప మరోటి కాదు.
కొన్నిసార్లు అలా ఉండాల్సి వస్తుంది, అది కూడా ఇండస్ట్రీని అభివృద్ధి చేయడం కోసమే, ఇండస్ట్రీకి సముచితంగా గౌరవించడం కోసమే అని తెలిపారు రేవంత్ రెడ్డి. అల్లు అర్జున్, అశ్వినీదత్ పిల్లలు, ఇలా చాలా మంది చిన్నప్పట్నుంచి తనకు తెలుసు అని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ రాష్ట్రం విజన్ 2047
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం విజన్‌ని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. 2047కి మనకు స్వాతంత్ర్య వచ్చి వంద ఏళ్లు అవుతుందని, అప్పటి వరకు దేశం అన్ని రకాలుగా ముందుండాలనే ప్రణాళికతో వెళ్తున్నామని, అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వాన్ని ఉన్నతమైన స్థానంలో ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు సీఎం.
అన్ని పరిశ్రమలను అభివృద్ధి చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో భాగంగానే చిత్రపరిశ్రమ కూడా ఉన్నత స్థానంలో ఉంచాలని, మిగిలిన పరిశ్రమలు అభివృద్ధి చెందినట్టుగానే చిత్ర పరిశ్రమని కూడా గొప్ప స్థాయిలో ఉంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
హాలీవుడ్ ని హైదరాబాద్‌కి తీసుకురావాలని సూచన
2047కి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్లే దిశగా ప్రణాళికలు రచిస్తున్నామని, అందులో భాగంగానే 2030 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమికీ తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. రానున్న రోజుల్లో తెలుగు చిత్ర పరిశ్రమని కూడా అదే స్థాయిలో గొప్పగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా రాజమౌళి లాంటి దర్శకులను తాను ఒక్కటే కోరుతున్నా, మనం హాలీవుడ్ అంటూ వెళ్లడం కాదు, ఆ హాలీవుడ్‌నే ఇక్కడికి తీసుకురావాలని, అలాంటి స్టూడియోలు ఇక్కడే డెవలప్ చేయాలని, అందుకోసం ప్రణాళికలు రచించాలని, దానికి తాను అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తానని వెల్లడించారు.
భవిష్యత్‌లో తాను ఏ స్థాయిలో ఉన్నా ఇండస్ట్రీకి అన్ని రకాలుగా అండగా ఉంటానని చెప్పారు సీఎం. తెలంగాణ విజన్ 2047లో ఒక ఛాప్టర్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వదిలేస్తున్నట్టు, అందులో ఏం రాస్తారో రాయండి అని ఇండస్ట్రీ పెద్దలకు సూచించారు సీఎం.
ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ
తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందని, ఒక జపాన్, చైనా, సౌత్ కొరియా వంటి దేశాలతో పోటీ పడుతుందని, భవిష్యత్‌లో ఆ స్థాయిలో అభివృద్ధి చేసి తీరుతామని, అందుకోసం కష్టపడి వారిని చేరుకుంటామని చెప్పారు. ఇండియాలో 500 ఫార్చ్యూన్ కంపెనీలు ఉంటే, అందులో హైదరాబాద్‌లోనే 87 కంపెనీలున్నాయని సీఎం చెప్పారు.
తెలంగాణ విజన్ 2047కి కచ్చితంగా చేరుకుంటామని, ఆ తర్వాత కూడా ఒక పెద్ద ఈవెంట్ పెట్టి ఈ విషయం చెబుతానని వెల్లడించారు. తాను చెప్పింది చేస్తానని, ఇప్పటి వరకు అన్నీ విజయవంతంగా చేసుకుంటూ వస్తున్నానని తెలిపారు.
గద్దర్ కుటుంబానికి అండగా తెలంగాణ ప్రభుత్వం
ప్రజా గాయకుడు గద్దర్ గురించి చెబుతూ, ఆయనొక విప్లవమని, చైతన్యమని, వేగు చుక్క అంటూ ప్రశంసలు కురిపించారు. `జై జై తెలంగాణ` ని అందెశ్రీ అందించినట్టే, `జై భోలో తెలంగాణ`ని గద్దర్ అన్న మనకు అందించారని, తెలంగాణ కోసం ఎంతో చేశారని తెలిపారు. ఆయన గుర్తుగా ఈ గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా గద్దర్ కుటుంబానికి తన అభినందనలు తెలిపారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా గద్దర్ ఫిల్మ్ అవార్డులను అందుకున్న సినిమా కళాకారులకు ఆయన అభినందనలు తెలిపారు.


