ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ సోదరుడు చోటాకే నాయుడు సోదరుడు శ్యామ్‌ కేనాయుడు తనను మోసం చేశాడంటూ నటి శ్రీసుధ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో శ్యామ్‌ కే నాయుడు అరెస్ట్ కూడా అయ్యాడు. అయితే కొద్ది రోజుల తరువాత శ్యామ్, శ్రీ సుధలు రాజీపడ్డారంటూ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ విషయంపై మరోసారి కోర్టును ఆశ్రయించిన శ్రీ సుథ తాను రాజీ పడినట్టుగా తప్పుడు పత్రాలు సృష్టించారంటూ కోర్టుకు తెలిపింది.

ఈ నేపథ్యంలో శ్రీసుధ తాజాగా ఎస్సార్‌నగర్‌ మాజీ సీఐ మురళీ కృష్ణపై ఏసీబీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సీఐ తన దగ్గర డబ్బులు తీసుకోవటంతో పాటు  శ్యామ్‌ కే నాయుడిని అరెస్ట్  చేయకపోవటం, కోర్టులో రాజీ కుదర్చుకున్నట్టుగా నకిలీ పత్రాలను సృష్టించారని ఆమె ఫిర్యాదులో పేర్కోంది. ఈ మేరకు తాను సీఐలో మాట్లాడిన ఆధారాలను కూడా ఏసీబీ అధికారులకు అందించింది.

కంప్లయింట్‌ తీసుకున్న పోలీసులు ప్రాధమిక విచారణ తరువాత మురళీ కృష్ణపై కేసు నమోదు చేశారు. చాలా రోజులుగా నలుగుతున్న ఈ కేసు సీఐపై ఫిర్యాదుతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. పలు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో నటించిన శ్రీ సుధ, తనను శ్యామ్‌ కే నాయుడు పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని చాలా రోజుల క్రితం ఫిర్యాదు చేసింది.