తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ - ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘ధృవ నచ్చతిరం’. గతంలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాగా.. తాజాగా గౌతమ్ మీనన్ మరో హింట్ వదిలారు.
పాపులర్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న స్పై ఫిల్మ్ ధృవ నచ్చతిరమ్ (Dhruva Natchathiram). తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. హీరోయిన్లుగా గ్లామర్ బ్యూటీలు రితూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. అయితే గౌతమ్ మీనన్ ఈ చిత్రాన్ని ప్రకటించి దాదాపు ఆరేండ్లు పూర్తవుతోంది. 2016లోనే సినిమా సెట్స్ పైకి వెళ్లింది. అప్పటికే దాదాపు ఏడు దేశాల్లో చిత్రీకరణను పూర్తి చేశారు. కానీ తర్వాత ఆర్థిక సమస్యల కారణంగా సినిమాను తాత్కాలికంగా నిలిపేశారు.
తాజాగా గౌతమ్ మీనన్ ఈ చిత్రంపై స్పందించారు. ఈ సందర్భంగా చియాన్ విక్రమ్, గౌతమ్ మీనన్ కలిసి ఉన్న కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు. అలాగే ‘ధృవ నచ్చతిరమ్’ సినిమాపైనే హింట్ వదిలారు. ఈ క్రేజీ కాంబో పిక్స్ ను పంచుకుంటూ ‘నక్షత్రాలు సమలేఖనం అవుతాయి’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో మొదలై ఆగిన సినిమాను రీషూట్ చేసేపనిలో ఉన్నట్టు ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
2018లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ ఆర్థిక పరిస్థితులు, కరోనా నేపథ్యం, చియాన్ విక్రమ్ ఇతర సినిమాలకు సమయం కేటాయించడం వంటి వాటితో సినిమా ఆలస్యమవుతూనే వచ్చింది. తాజాగా గౌతమ్ మీనన్ పోస్ట్ తో తమిళ ప్రేక్షకులు, విక్రమ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. పాపులర్ డైరెక్టర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై అప్డేట్స్ ను త్వరగా అందించాలని కోరుతున్నారు.
చిత్రంలో ఆర్ పార్తిబన్, సిమ్రాన్, దివ్యదర్శిని, వినాయకన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజ్ అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు.
