మెగా బ్రదర్స్‌ చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లతో త్వరలోనే ఓ మల్టీస్టారర్‌ చిత్రం చేయనున్నట్లు నిర్మాత, ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అలాంటిదేమీ లేదని ఇటీవల గుసగుసలు వినిపించాయి. ఈ చిత్రం తెరకెక్కే అవకాశమే లేదని, పవన్ కళ్యాణ్ ఇటు రాజకీయాల్లోనూ, అటు సినిమాల్లోనూ బిజీగా ఉండటం, మరోవైపు చిరంజీవి కూడా రాజకీయాల్లో, సినిమాల్లో తిరిగి బిజీ అయిపోవడంతో ఇద్దరూ కలిసి సినిమా చేసే అవకాశం లేదని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. 

కానీ మెగాస్టార్, పవర్ స్టార్ ఇద్దరితో కలిపి మల్టీస్టారర్‌ సినిమా తీసేందుకు కథ సిద్ధమవుతోందని, ఈ చిత్రానికి అశ్వనీదత్‌ నిర్మాతగా ఉంటారని సుబ్బరామిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ చిత్రంపై అభిమానుల్లో సహజంగానే ఎక్కువగా అంచనాలు ఉంటాయని, అందుకనుగుణంగానే కథను సిద్ధం చేస్తున్నామని అన్నారు. మొత్తానికి మెగా పవర్ మూవీపై ఆశలు వదులుకోవాలనుకున్న దశలో మెగా అభిమానులకు మరోసారి సుబ్బరామిరెడ్డి గుడ్ న్యూస్ ఇచ్చారని చెప్పాలి.


మహాశివరాత్రి సందర్భంగా విశాఖ సాగరతీరంలో లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యంలో శుక్రవారం కోటి శివలింగ ప్రతిష్ట, మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్టు సుబ్బరామిరెడ్డి వెల్లడించారు. సాగరతీరంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో పెందుర్తి శారదాపీఠం స్వామి స్వరూపానంద సరస్వతి, పలువురు మంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొననున్నారు.