చిరంజీవి విశ్వంభర సినిమా కోసం కీరవాణి ఉండగా, మరో మ్యూజిక్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ అలా ఎందుకు చేశారు?
మెగాస్టార్ చిరంజీవి వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందిపడ్డారు. వాల్తేరు వీరయ్య తప్పించి అన్ని సినిమాలు ప్లాప్ అవ్వడంతో కాస్త గ్యాప్ తీసుకున్నారు. వాల్తేరు వీరయ్య తరువాత మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బోళా శంకర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో కాస్త టైమ్ తీసుకుని విశ్వంభర స్టార్ట్ చేశారు చిరు. ప్రస్తుతం విశ్వంభర సినిమాపై అభిమానులు, సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాను బింబిసార ఫేమ్, యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకుడిగా తెరకెక్కిస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కూడా నటిస్తున్నారని సమాచారం. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు భారీ స్పందన వస్తోంది.
రీసెంట్ గా ఈ సినిమా నుంచి విడుదలైన పాట హైలెట్ అయ్యింది. ఇక ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. కీరవాణి ఈసినిమా కోసం ప్రత్యేకంగా డిఫరెంట్ ట్యూన్స్ ను కంపోజ్ చేశారని తెలుస్తోంది. అంతే కాదు సినిమా స్టార్టింగ్ లో బెంగళూరులోని ఫామ్ హౌస్ లో, మెగా స్టార్ తో కలిసి కీరవాణి స్పెషల్ మ్యూజిక్ సిట్టింగ్స్ వేయడం కూడా తెలిసిందే.
అయితే తాజా సమాచారం ప్రకారం, కీరవాణితో పాటు మరో మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈ సినిమాకు పని చేస్తున్నట్టు తెలుస్తోంది. అతను ఎవరో కాదు.. ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదుగుతున్న భీమ్స్ సిసిరోలియో. కీరవాణితో పాటు భీమ్స్ కూడా ఈసినిమా కోసం పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.
భీమ్స్ ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాటను కంపోజ్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ పాట చిత్రంలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచే అవకాశం ఉంది. ఇటీవలే భీమ్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ పాటల వల్ల సినిమా విజయంలో సంగీతం ఎంత ప్రభావం చూపిస్తుందో మరోసారి ప్రూవ్ అయింది.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా, వెంకటేష్ హీరోగా నటించారు. ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డు నమోదు చేసింది. ఈ విజయం తర్వాత అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టుపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ క్రమంలో విశ్వంభర సినిమాకు మ్యూజిక్ విషయంలో భీమ్స్ ను తీసుకోవడం కీరవాణి సలహాతోనే జరిగినట్టు సమాచారం. అయితే భీమ్స్ విషయంలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం ఇవ్వలేదు. ప్రస్తుతం ఇది రూమర్ గానే ఉంది. ఇది నిజం అయితే ఒకవైపు లెజెండరీ కీరవాణి సంగీతం, మరోవైపు యంగ్ సెన్సేషన్ భీమ్స్ సంగీతం కలవడం ఈ సినిమాను మరింత స్పెషల్ గా మార్చబోతోంది. ఇక ఈసినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్న విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా కొనసాగుతుంది. ఇక త్వరలోనే మూవీ టీమ్ ప్రోమో మేటీరియల్‌తో అభిమానుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
