ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను (YS Jagan) ప్రముఖ హీరో చిరంజీవి (Chiranjeevi) నేడు కలవనున్నారు. తాడేపల్లి‌లోని సీఎం జగన్‌ క్యాంప్‌ కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను (YS Jagan) ప్రముఖ హీరో చిరంజీవి (Chiranjeevi) నేడు కలవనున్నారు. తాడేపల్లి‌లోని సీఎం జగన్‌ క్యాంప్‌ కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. చిరంజీవి, వైఎస్ జగన్ కలిసి లంచ్ చేయనున్నారు. ఇందుకోసం చిరంజీవి ఉదయం 11.30 గంటల సమయంలో చిరంజీవి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఆయన తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి చేరుకుంటారు. దాదాపు ఒంటి గంట ప్రాంతంలో సీఎం జగన్, చిరంజీవిల మధ్య భేటీ జరగనుంది. చిరంజీవికి సీఎం జగన్‌ లంచ్ ఆతిథ్యం ఇవ్వనున్నారు.

అయితే కొంతకాలంగా ఏపీలో సినిమా టికెట్ల ధరల వివాదం కొనసాగుతుంది. ఇది రోజురోజుకు ముదురుతుంది. ఈ క్రమంలోనే చిరంజీవి రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. సినిమా టికెట్ల ధరల వివాదంతో పాటుగా, చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల గురించి సీఎం జగన్‌తో చిరంజీవి చర్చించే అవకాశం ఉంది. 

ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సినీ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపై పలువురు సినీ నిర్మాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి.. సినీ ఇండస్ట్రీ పెద్దగా ఉండటం తనకు అసలు ఇష్టం లేదని అన్నారు. పెద్దరికం హోదా తనకు ససేమిరా ఇష్టం లేదని చెప్పారు. కానీ బాధ్యత గల బిడ్డగా ఉంటానని తెలిపారు. పెద్దగా ఉండను కానీ బాధ్యత గల బిడ్డగా ఉంటానని చెప్పారు. ఇద్దరు కొట్టుకుంటే తగువు తీర్చమంటే తీర్చనని అన్నారు. ఆపదలో ఉంటే మాత్రం కచ్చితంగా ఆదుకుంటానని వెల్లడించారు.