మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ వేదిక కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేయబోతోంది. దీనికి సంబంధించిన అప్డేట్ ని చిత్ర యూనిట్ రివీల్ చేయబోతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫాంటసీ యాక్షన్ చిత్రం విశ్వంభర కోసం మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సంబంధించిన సీజీ వర్క్ ఆలస్యం అవుతుండడంతో మూవీ రిలీజ్ కూడా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ఇంకా చిత్ర యూనిట్ ప్రకటించలేదు.
టీజర్ కి నెగిటివ్ రెస్పాన్స్
ఇంతకుముందు విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది, సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. గ్రాఫిక్స్ విషయంలో లోపాలు స్పష్టంగా కనిపించడంతో అభిమానులు నిరాశ చెందారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ విజువల్స్ నాణ్యతను మెరుగుపర్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సినిమా రిలీజ్ ఆలస్యం అవుతున్నప్పటికీ అవుట్ పుట్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదని డిసైడ్ అయ్యారు.
కాన్స్ లో విశ్వంభర ఎపిక్ రివీల్
ఇటీవల విడుదలైన రామ రామ అనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. ఆ సాంగ్ పర్వాలేదనిపించింది. తాజాగా విశ్వంభర చిత్ర యూనిట్ చేసిన ఒక ప్రకటన ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచేస్తోంది. చిత్ర నిర్మాత విక్రమ్ రెడ్డి విశ్వంభర సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకమైన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు తీసుకెళ్లారు. యువి క్రియేషన్స్ సంస్థ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా, “నిర్మాత విక్రమ్ రెడ్డి విశ్వంభర చిత్రాన్ని కాన్స్ కు తీసుకెళ్లారు. గురువారం రోజు విశ్వంభర వరల్డ్ కి సంబంధించిన ఎపిక్ రివీల్ ఉండబోతోంది,” అని ప్రకటించింది. ఈ ఎపిక్ రివీల్‌లో కొత్త గ్లింప్స్, టీజర్ రిలీజ్ చేస్తారా? లేక ఇంకేమైనా సర్ప్రైజ్ ఉండబోతోందా ? అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.
హీరోయిన్ గా త్రిష
ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తున్నారు. ఆమెతో పాటు కునాల్ కపూర్, ఆషిక రంగనాథ్, రమ్యా పసుపులేటి, ఈషా చావ్లా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విశ్వంభర చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం విషయంలో ఆంచనాలు పెంచేలా ఇంతవరకు చిత్ర యూనిట్ ఫ్యాన్స్ కి ఎలాంటి కానుక ఇవ్వలేకపోయింది. కాన్స్ లో రివీల్ చేసే అప్డేట్ తో అయినా ఈ మూవీపై అంచనాలు పెరుగుతాయేమో చూడాలి. జగదేక వీరుడు అతిలోక సుందరి, అంజి చిత్రాల తర్వాత చిరంజీవి ఫాంటసీ జోనర్ లో నటిస్తున్న చిత్రం ఇదే. దీనితో ఈ మూవీ మెగాస్టార్ కెరీర్ లో స్పెషల్ మూవీ గా మిగిలిపోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి డైరెక్టర్ వశిష్ట ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.