ఖైదీ నెంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. చిరు కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

 

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను చైనాలో తెరకెక్కించనున్నట్లు సమాచారం. అంతేకాదు చైనాలోనూ ‘సైరా’ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. భారతీయ చిత్రాలకు ప్రస్తుతం చైనాలో మంచి ఆదరణ దక్కుతోంది. ‘బాహుబలి,’ ‘దంగల్‌’, ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’, ‘బజరంగీ భాయ్‌జాన్‌’ వంటి చిత్రాలు చైనా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించాయి.

 

తెలుగు ప్రేక్షకులతో పాటు చైనా ప్రేక్షకులనూ మెప్పించేలా సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమా తర్వాతి షెడ్యూల్‌ కేరళలోని కొచ్చి ప్రాంతంలో జరగనుంది. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ఇందులో గురువు పాత్రలో నటిస్తున్నారు. విజయ్‌ సేతుపతి, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిరుకి జోడీగా నయనతార నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై ఈ సినిమాను రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కుతోంది.