సినీ నటుడు సునీల్ తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. ఆయన ప్రయాణిస్తున్న కారుకి పెద్ద యాక్సిడెంట్ జరగడంతో అక్కడిక్కడే చనిపోయేవాడినని కానీ చిరంజీవి కారణంగా ఇంకా బతికున్నానంటూ చెప్పుకొచ్చాడు సునీల్.

వివరాల్లోకి వెళితే.. ఠాగూర్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సునీల్ తన స్వస్థలమైన భీమవరం వెళ్లాల్సివచ్చింది. దీంతో షూటింగ్ స్పాట్ లో ఉన్న చిరంజీవికి చెప్పి వెళ్దామని కార్వాన్ దగ్గరకి వెళ్లాడు. అప్పుడు చిరు సీట్ బెల్ట్ పెట్టుకొని జాగ్రత్తగా ప్రయాణం చేయమని చెప్పి వెళ్లిపోయారట.

సాధారణంగా సీట్ బెల్ట్ పెట్టుకోని సునీల్.. తను ఎంతగానో అభిమానించే చిరు అన్నయ్య చెప్పడంతో సీట్ బెల్ట్ పెట్టుకొని కారులో భీమవరానికి బయలుదేరాడు. దారి మధ్యలో ఊహించని విధంగా పెద్ద యాక్సిడెంట్.

సునీల్ కారు నాలుగు పల్టీలు కొట్టింది. సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. లేకపోతే ఆరోజే ప్రాణాలు పోయేవంటూ చెప్పుకొచ్చాడు సునీల్. ఆరోజు  అన్నయ్య సలహా వినడం వలనే ప్రాణాలు నిలుపుకున్నానంటూ చిరు చేసిన మాట సాయాన్ని గుర్తుతెచ్చుకున్నాడు.