కరోనా కల్లోలం అంతా ఇంతా కాదు. ఏ క్షణాన ఏం జరుగుతుందో, ఎవరికి సోకుతుందో అర్థం కావడం లేదు. జనజీవనం అస్థవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ సైతం కరోనా విలయతాండవాలనికి బలవుతుంది. ఇప్పటికే పలు సినిమాలు కరోనా ప్రభావంతో వాయిదా పడ్డాయి. మరోవైపు షూటింగ్‌లు కూడా నిలిచిపోతున్నాయి. తాజాగా చిరంజీవిని కూడా కరోనా భయపెట్టింది. వైరస్‌ మరింతగా విజృంభిస్తున్న నేపథ్యంలో మెగాస్టార్‌ తన `ఆచార్య` చిత్రాన్ని వాయిదా వేసుకున్నారు. 

చిరంజీవి హీరోగా, కాజల్‌ కథానాయికగా, రామ్‌చరణ్‌ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో చరణ్‌ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై ఈ సినిమాని గ్రాండ్‌గా రూపొందిస్తున్నారు. దీన్ని మే 13న విడుదల చేయాలని భావించారు. కానీ కరోనా ప్రభావంతో దాన్ని వాయిదా వేసుకున్నారు. షూటింగ్‌ పార్ల్ కొద్దిగా మిగిలి ఉండటం, వైరస్‌ ప్రభావంతో థియేటర్లు మూత పడుతుండటంతో సినిమా విడుదల సరైనది కాదని చిత్ర బృందం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కరోనా తగ్గి, పరిస్థితులు కుదుట పడ్డాక విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది. ఇటీవల పూజా హెగ్డేకి కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.