మార్చి 7 నుంచి 15 వరకు జేకే మైన్స్ లో `ఆచార్య` షూటింగ్ నిర్వహించనున్నారు. దీనికి అనుమతులు ఇవ్వాలని మంత్రిని దర్శకుడు కొరటాల కోరగా అందుకు మంత్రి పువ్వాడ సానుకూలంగా స్పందించారు. వెంటనే ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు.
ఖమ్మం జిల్లా, ఇల్లందు సమీపంలో చిరంజీవి నటిస్తున్న `ఆచార్య` చిత్ర షూటింగ్ జరిపేందుకు అనుమతులు కావాలని దర్శకుడు కొరటాల శివ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 7 నుంచి 15 వరకు జేకే మైన్స్ లో `ఆచార్య` షూటింగ్ నిర్వహించనున్నారు. దీనికి అనుమతులు ఇవ్వాలని మంత్రిని దర్శకుడు కొరటాల కోరగా అందుకు మంత్రి పువ్వాడ సానుకూలంగా స్పందించారు. వెంటనే ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. చిత్ర షూటింగ్ కోసం స్థానికంగా అనుమతులతో పాటు చిత్ర హీరో చిరంజీవికి తానే తన నివాసంలో ఆతిధ్యం ఏర్పాటు చేస్తామని వారికి తెలిపారు.
మిగతా జిల్లాలతో పోల్చితే పర్యాటక రంగంగా ఉమ్మడి ఖమ్మం అభివృద్ధి చెందిందని, వివిధ చిత్రాల షూటింగ్ ల కోసం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంతో అనువైన ప్రదేశమని కొరటాల శివ పేర్కొన్నారు. గత తో పోల్చితే ఖమ్మం స్వరూపం పూర్తిగా మారిపోయిందని అందుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి అభినందనలు తెలియజేశారు.
ఇల్లందులోని జేకే మైన్స్ లో జరిగే `ఆచార్య` షూటింగ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్ పాల్గొంటారని చిత్ర బృందం వెల్లడించింది. జేకే మైన్స్ ఓపెన్ కాస్ట్ తోపాటు అండర్ గ్రౌండ్ మైనింగ్‌లోనూ షూటింగ్ జరుపనున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని కోకా పేటలో జరిగిన `ఆచార్య` షూటింగ్ సెట్‌లో చిరంజీవి మంత్రి కలిసిన విషయం తెలిసిందే. సినిమా విజయవంతం కావాలని ఆ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.
ఇక చిరంజీవి హీరోగా, కాజల్ హీరోయిన్‌గా, రామ్‌చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న `ఆచార్య` చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ప్రై లిమిటెడ్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. దీన్ని మే 13న విడుదల చేయనున్నారు.
