చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. భారీ తారాగణం, భారీ బడ్జెట్‌తో ఈ సినిమా లావిష్‌గా తెరకెక్కుతుంది. వాణిజ్య అంశాలకు, మంచి సందేశాన్ని, సామాజిక అంశాలను జోడించి కొరటాల శివ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో చిరు సరసన కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. 

ఈ సినిమా కోసం భారీ సెట్‌ వేస్తున్నట్టు, దాదాపు ఇరవై ఎకరాల్లో టెంపుల్‌ టౌన్‌ని నిర్మిస్తున్నట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. తాజాగా దాన్ని నిజం చేసి చూపించారు మెగాస్టార్‌. ఆయనే అధికారికంగా ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. అంతేకాదు ఇండియాలోనే అతిపెద్ద సెట్‌ ఇదని వెల్లడించారు. ఈ మేరకు ఈ టెంపుల్‌ని వీడియో తీసి సోషల్‌  మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 

ఈ సందర్భంగా చిరు వీడియోలో స్పందిస్తూ, ``ఆచార్య` సినిమా కోసం ఇండియాలోనే అతిపెద్ద టెంపుల్‌ టౌన్‌ సెట్‌ ఇది. ఇరవై ఎకరాల విస్తీర్ణంలో వేయడం జరిగింది. అందులో భాగంగా గాలిగోపురం..ఆశ్చర్యం గొలిపేలా ప్రతి చిన్న చిన్న డిటెయిల్స్ ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇది కళాదర్శకుల ప్రతిభకే ఓ మచ్చుతునక. నాకెంతో ముచ్చటనిపించి, నా కెమెరాలో బంధించి మీతో పంచుకుంటున్నా. నిజంగానే టెంపుల్‌ టౌన్‌లో ఉన్నామా? అనేంతగా రూపొందించిన కళా దర్శకుడు సురేష్‌ని, దీన్ని విజువలైజ్‌ చేసిన దర్శకుడు కొరటాల శివని, దీన్ని ఇంత అపురూపంగా నిర్మించేందుకు సహకరించి, కావాలసిన వనరులను అందించిన నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్‌లను అభినందిస్తున్నాను. ఇది ఆడియెన్స్ కి ఆనందానుభూతులను ఇస్తుందని నమ్ముతున్నా` అని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.