కరోనా సెకండ్‌ వేవ్‌ విలయతాండవం చేస్తుంది. లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. వందల మంది మృత్యువాత పడుతున్నారు. అందులో సినిమా రంగానికి చెందిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే కరోనా నుంచి కోలుకోవడానికి వ్యాక్సిన్‌తోపాటు ప్లాస్మా సంజీవనిగా పనిచేస్తుందన్న విషయం తెలిసిందే. ఫస్ట్ వేవ్‌ కరోనా సమయంలో దీనిపై విసృతంగా ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ఆ విషయంపై ఎవరూ స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో మరోసారి చిరంజీవి దీనిపై అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. 

తాజాగా ఆయన ప్లాస్మా దానంపై ట్వీట్‌ చేశారు. `సెకండ్‌ వేవ్‌ కరోనా ఎంతగా విజృంభిస్తుందో తెలిసిందే. చాలా మందిపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. రోజు రోజుకి బాధితులు మరింతగా పెరుగుతున్నారు. ముఖ్యంగా ప్లాస్మా కొరత వలన చాలా మంది ప్రాణాల కోసం పోరాడుతున్నారు. వారిని ఆదుకునేందుకు మీరు ముందుకు రావాల్సిన సమయమిది. మీరు కరోనా నుంచి కొద్ది రోజుల ముందే కోలుకుని ఉన్నట్లయితే, మీ ప్లాస్మాని దానం చేయండి.

ప్లాస్మా దానం చేయడం వల్ల ఇంకో నలుగురు కరోనా నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయపడిన వారవుతారు. నా అభిమానులు కూడా ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నా. ప్లాస్మా డొనేషన్‌ గురించిన వివరాలకి, సరైనా సూచనలకు చిరంజీవి ఛారిటబుల్‌ ఫౌండేషన్‌ ఆఫీస్‌ని సంప్రదించండి` అంటూ ఫోన్‌ నెంబర్‌ పంచుకున్నారు చిరంజీవి.