తనకు అరుదైన పురస్కారం లభించడం పట్ల చిరంజీవి స్పందించారు. అదే సమయంలో తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ విషెస్‌ చెబుతూ ఓ ఎమోషనల్‌ నోట్‌ని పంచుకున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. ఆయన్ని `ఇండియన్‌ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ -2022` అవార్డుని అందించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. గోవాలో 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు ప్రారంభం సందర్భంగా చిరుకి ఈ అవార్డుని ప్రకటించారు. భారతీయ సినిమా ప్రారంభమై వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2013 నుంచి ఈ అవార్డుని ప్రదానం చేస్తున్నారు. ఈ ఏడాదికిగానూ మెగాస్టార్‌ చిరంజీవికి ఈ పురస్కారాన్ని ప్రకటించారు.

ఈ సందర్భంగా ఈ పురస్కారంపై చిరంజీవి స్పందించారు. తన ఆనందాన్ని వ్యక్తంచేశారు.ఈ గౌరవానికి ఎంతో సంతోషిస్తూ వినమ్రంగా భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కేంద్ర సమాచార ప్రసారాల శాఖకి, మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌,గోవా ఫిల్మ్ ఫెస్టివల్ టీమ్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటానికి అభిమానులే కారణం. వారికి రుణపడి ఉంటానని పేర్కొన్నారు చిరు. 

Scroll to load tweet…

అన్నయ్య చిరుకి అరుదైన పురస్కారం రావడం పట్ల తమ్ముడు పవన్‌ కళ్యాణ్ తన ఆనందాన్ని షేర్ చేశారు. `తెలుగు చలన చిత్రసీమలో శిఖర సమానులు, అన్నయ్య చిరంజీవి కి ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022’ పురస్కారం వరించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో భాగంగా భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారం అన్నయ్య కీర్తి కిరీటంలో చేరిన మరొక వజ్రం. ఈ ఆనంద సమయంలో నా మార్గదర్శి అన్నయ్య చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను.

నాలుగు దశాబ్దాలుపైబడిన అన్నయ్య సినీ ప్రస్థానం, తనను తాను మలచుకొని ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థానం సంపాదించుకోవడం నాతో సహా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. అంతర్జాతీయ చలన చిత్ర వేదికపై అన్నయ్య చిరంజీవి గారికి ఈ గౌరవం దక్కుతున్నందుకు ఎంతో ఆనందిస్తున్నా` అని పేర్కొన్నారు పవన్‌. ఆయనతోపాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు చిరుకి విషెస్‌ తెలియజేస్తున్నారు. ఈ పురస్కార గ్రహీతకు నెమలి బొమ్మ కలిగిన రజత పతకం, పది లక్షల రూపాయలు, ధృవీకరణ పత్రాన్ని అందజేస్తారు.