కోలీవుడ్ బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటున్నారు. లేడీ విలన్ పాత్రలతో పాటు కీలకమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె బిజీ అవుతున్నారు. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ క్రాక్ మూవీలో జయమ్మగా వరలక్ష్మీ ఇరగదీశారు. లేడీ విలన్ గా ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. మెగాస్టార్ చిరంజీవి సైతం తనను అభినందించినట్లు వరలక్ష్మీ శరత్ కుమార్ తెలియజేశారు. 


క్రాక్ సినిమాలో జయమ్మగా నీ నటన బాగుంది. అలాగే డబ్బింగ్ కూడా బాగా చెప్పావ్ అంటూ... చిరంజీవి ఫోన్ చేసి మరీ.. వరలక్ష్మికి అభినందనలు తెలిపారట, ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో వరలక్ష్మీ చెప్పి, ఆనందం వ్యక్తం చేశారు. తమిళ్, తెలుగుతో పాటు కన్నడలో కలిపి ఏడెనిమిది చిత్రాలు వరలక్ష్మీ చేస్తున్నారు. 


అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన నాంది మూవీలో ఆమె లాయర్ రోల్ చేస్తున్నారు. లాయర్ పాత్ర కావడంతో లెక్కకు మించి డైలాగులు ఉండేవి అట. స్కూల్ పిల్లలా అవన్నీ రాసుకొని, బట్టీ పట్టేదానిని అని వరలక్ష్మీ తెలియజేశారు. వచ్చే వారం నాంది విడుదల కానుంది. అలాగే సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో ఓ పాత్ర చేస్తున్నట్లు వరలక్ష్మీ తెలియజేశారు. మరో రెండు తెలుగు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయట. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు వరలక్ష్మీ.