చిత్ర పరిశ్రమకి సీఎం కేసీఆర్‌ పలు వరాలు కురిపించారు. రేపటినుంచే థియేటర్లు ఓపెన్‌ చేసేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో చిత్ర పరిశ్రమ నుంచి సంతోషం వ్యక్తమవుతుంది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కి, తెలంగాణ ప్రభుత్వానికి చిత్ర ప్రముఖులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌, రామ్‌చరణ్‌ వంటి వారు స్పందించి థ్యాంక్స్ చెప్పారు.

మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్‌ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ఆయన చెబుతూ, `కరోనాతో కుదేలైన సినిమా రంగానికి వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్‌కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. చిన్న సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ రీఎంబర్స్ మెట్‌, రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లకు విద్యుత్‌ కనీస డిమాండ్‌ ఛార్జీలు రద్దు, రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్స్ లో షోలను పెంచుకునేందుకు అనుమతివ్వడం. 

మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీలలో ఉన్న విధంగా టిక్కెట్ల ధరలను సవరించుకునే వెసులుబాటు లాంటి చర్యలు ఈ కష్ట సమయంలో ఇండస్ట్రీకి, దానిపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలకు ఎంతో తోడ్పాటుగా ఉంటాయి. కేసీఆర్‌ నేతృత్వంలో ఆయన విజన్‌కి తగ్గట్టుగా తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి సాధించి దేశంలోనే మొదటి స్థానాన్ని పొందుతుందన్న పూర్తి విశ్వాసం మాకుంది` అని తెలిపారు చిరంజీవి. 

నాగార్జున స్పందిస్తూ, కోవిడ్‌ కారణంగా చీకట్లో కూరుకుపోయి ఉన్న చిత్ర పరిశ్రమకి ఇలాంటి అనిశ్చిత సమయాల్లో అవసరమైన సహాయక చర్యలు తీసుకున్న సీఎం కేసీఆర్‌కి కృతజ్ఞతలు` అని పేర్కొన్నారు. 

రామ్‌చరణ్‌ స్పందిస్తూ, తెలుగు చిత్ర పరిశ్రమలో సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి తగిన  సహాయక చర్యలు ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు` అని చెప్పారు.