వింటానికే వింతగా ఉంది కదా...అయితే ఆ కాంబినేషన్ సెట్ అయ్యింది..ఇప్పుడు కాదు..చాలా ఏళ్ల క్రితం..అప్పుడు ఉపేంద్ర తెలుగులో వరసపెట్టి సూపర్ హిట్స్ ఇస్తున్న టైమ్ లో. అప్పట్లో చిరంజీవి స్వయంగా ఉపేంద్ర దర్శకత్వంలో సినిమా చెయ్యాలని ఉత్సాహపరడ్డారట. అయితే ఎందుకనో అది వర్కవుట్ కాలేదు. ఆ విషయం ఇంతకాలానికి వైవియస్ చౌదరి బయిటపెట్టారు.

ఉపేంద్ర హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఐ లవ్‌ యు’. ‘నన్నే... ప్రేమించు’ అనేది క్యాప్షన్ తో తెలుగులో రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం టీజర్ విడుదల సందర్బంగా వైవియస్ చౌదరి మాట్లాడుతూ ఈ విషయం చెప్పుకొచ్చారు. 

ఈ సందర్భంగా వైవీఎస్‌ చౌదరి మాట్లాడుతూ.. ‘నేను కో డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఉపేంద్రగారితో పనిచేసే అదృష్టం కలిగింది. నేను వైజయంతి మూవీస్‌లో పని చేస్తున్నప్పుడు చిరంజీవిగారి సినిమాకు దర్శకత్వం వహించమని ఆయన్ను పిలిపించారు. ఒక బ్యాచ్‌తో వచ్చారు. అప్పటివరకూ చేస్తున్న కథలను పక్కన పెట్టి... వేరే జానర్‌లో సినిమా ఇలా ఉంటుందని ఊహించలేని విధంగా రూల్స్‌ని బ్రేక్‌ చేస్తూ కొత్త కథ చెప్పారు. అందరూ షాకయ్యారు. 

కమర్షియల్‌ పంథాలో కొత్త కోణంలో కథ చెప్పారు. ఆయన చుట్టూ ఎప్పుడూ ఒక పాజిటివ్‌ ఎనర్జీ ఉంటుంది. ఆయన సినిమాల్లో సోషల్‌ వేల్యూస్‌ ఉంటాయి. సమాజంలో కష్టనష్టాలను బ్లంట్‌గా చూపిస్తారు. ’’ అని గుర్తు చేసుకున్నారు. అయితే ఆ సినిమా ఎందుకు ఆగిపోయిందో మాత్రం చెప్పలేదు. కానీ ఉపేంద్ర, చిరంజీవి కాంబినేషన్ లో సినిమా వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఓ సెన్సేషన్ అయ్యుండేది.