మెగా మదర్ అంజనాదేవి అనారోగ్యానికి గురయినట్టు వస్తున్న వార్తలపై స్పందించారు మెగా బ్రదర్ నాగబాబు. ఈ విషయంలో క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు నాగబాబు.

మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు మంగళవారం (జూన్ 24) ఉదయం నుంచి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలతో మెగాభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఆంజనమ్మ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఆమెను హుటాహుటిన హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారని ప్రచారం జోరుగా సాగింది.

ఈ పరిస్థితుల మధ్య చిరంజీవి తన షూటింగ్‌ను మధ్యలోనే వదిలేసి హైదరాబాద్‌కు చేరుకున్నారన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా క్యాబినెట్ సమావేశం మధ్యలోనే వదిలేసి హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరినట్టు కథనాలు వినిపించాయి. ఈ వార్తలు మెగా అభిమానుల్లో గందరగోళాన్ని కలిగించాయి.

అంజనాదేవి అనారోగ్యం అని వైరల్ అయిన వార్తలు చూసిన మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ‘‘అంజనమ్మ త్వరగా కోలుకోవాలి’’ అంటూ పోస్టులు షేర్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక ఈ వార్తలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎక్స్ వేదికగా స్పందించిన నాగబాబు, అంజనా దేవి ఆరోగ్యం గురించి వచ్చిన తప్పుడు ప్రచారాన్ని ఖండించారు.

నాగబాబు ట్వీట్ చేస్తూ.. ‘‘అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది. ఆరోగ్యపరంగా ఆమె పూర్తిగా క్షేమంగా ఉన్నారు. కొంతమంది చేసిన తప్పుడు సమాచారం వల్ల ఈ వదంతులు వ్యాపించాయి. అమ్మ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు.'' అని స్పష్టం చేశారు.

నాగబాబు ఇచ్చిన ఈ క్లారిటీతో మెగాభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలోనూ ఇలాంటి ఆరోగ్య సంబంధిత రూమర్లు వస్తే, మెగా ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటనలు వచ్చి వాటిని తిప్పికొట్టిన సందర్భాలు ఉన్నాయి. వయస్సు పెరిగిన నేపథ్యంలో సాధారణ హెల్త్ చెకప్ కోసం అంజనా దేవి ఆసుపత్రికి తరచూ వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో వచ్చిన వార్తలే రూమర్లుగా మారినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో అంజనాదేవి ఆరోగ్యంపై వచ్చిన రూమర్లకు నాగబాబు ఇచ్చిన క్లారిటీతో మెగా ఫ్యామిలీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. చిరంజీవి కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి వార్తలు వచ్చిన ప్రతిసారి సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ నిజానిజాలపై స్పష్టత ఇవ్వడం మెగా ఫ్యామిలీ కొన్ని సందర్భాల్లో తప్పడంలేదు.

ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ నటిస్తున్నారు. షూటింగ్ పనులు సూపర్ ఫాస్ట్ గా సాగుతున్నాయి. అనిల్ రావిపూడి మార్క్ డైరెక్షన్ కు చిరంజీవి స్టైల్ కలిపి అద్భుతమైన సినిమా రాబోతుందన్న నమ్మకంతో ఉన్నారు మెగా ఫ్యాన్స్. అంతే కాదు ఈ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి.