మెగాస్టార్ చిరంజీవి 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తమ వంశానికి చెందిన వ్యక్తి జీవితచరిత్రతో సినిమా తీసినందుకు తమకి రూ.50 కోట్లు చెల్లించాలని ఉయ్యాలవాడ కుటుంబీకులు చిత్రనిర్మాత రామ్ చరణ్ ని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో వాళ్లు కోర్టుకి కూడా వెళ్లారు.

అయితే 'సైరా' నరసింహారెడ్డి సినిమా బయోపిక్ కాదని.. కల్పిత కథ అని చెప్పడం ద్వారా ఈ కేసుని కొట్టివేసేలా చేయగలిగాడుదర్శకుడు సురేందర్ రెడ్డి. దీంతో వివాదం సద్దుమణిగినప్పటికీ.. ఈ వివాదంపై తాజాగా చిరంజీవి మాట్లాడాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు చాలా అమాయకులని వారిని ఎవరో తమ మీదకి రెచ్చగొట్టి పంపించారని చిరు ఆరోపణలు చేశారు. 

నిజానికి వాళ్ల ఆర్ధిక పరిస్థితి సామాన్యమేనని.. కానీ తమకి యాభై కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ముందు తాము వారికి, వాళ్ల ఊరికి సాయం చేయాలనే అనుకున్నామని.. ఆ విషయం చూడమని ఎన్వీ ప్రసాద్‌కు చెప్పామని.. కానీ వాళ్లొచ్చి పాతిక కుటుంబాలున్నాం. మాకు కుటుంబానికి రూ.2 కోట్ల చొప్పున మొత్తం రూ.50 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో అన్యాయంగాఅనిపించిందని చిరు చెప్పాడు.

తాము చరిత్రను వక్రీకరిస్తే తప్పుబట్టాలని.. అంతేతప్ప డబ్బులు అడగకూడదని.. అడిగినా చట్టపరంగా ఇవ్వాల్సిన అవసరం లేదని.. సినిమాకి లాభాలు వస్తే.. ఆ ప్రాంతానికి ఏదైనా చేయాలని భావిస్తున్నామని చిరు స్పష్టం చేశారు.