Asianet News TeluguAsianet News Telugu

నటుడిగా `ప్రాణం` పోసుకున్న రోజుదిః చిరంజీవి ఎమోషనల్‌ ట్వీట్‌

`నా జీవితంలో ఆగస్ట్ 22కి ఎంత ప్రాముఖ్యత ఉందో, సెప్టెంబర్‌ 22కి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఆగస్ట్ 22 నేను మనిషిగా ప్రాణం పోసుకున్న రోజైతే, సెప్టెంబర్‌ 22 నటుడిగా `ప్రాణం(ఖరీదు)` పోసుకున్న రోజు`.

chiranjeevi emotional tweet on his first movie pranam khareedu arj
Author
Hyderabad, First Published Sep 22, 2020, 12:43 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి నటుడిగా నేటి(మంగళవారం)తో 42 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఆయన నటించిన తొలి సినిమా `ప్రాణం ఖరీదు` 1978లో సెప్టెంబర్‌ 22న విడుదలైంది. మంచి విజయాన్నిసాధించింది. 

కె.వాసు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో జయసుధ, రావుగోపాల్‌రావు, చంద్రమోహన్‌, చిరంజీవి, రేష్మా రాయ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో చిరంజీవిది ముఖ్యమైన పాత్ర. పల్లెటూరి యువకుడిగా చిరు మెప్పించారు. అయితే నిజానికి ఆయన ఫస్ట్ ఓకే చేసిన చిత్రం `పునాది రాళ్ళు` కానీ `ప్రాణం ఖరీదు` మొదట విడుదలై, చిరంజీవికి నటుడిగా ప్రాణం పోసిందనే చెప్పాలి. 

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిరు ట్వీట్‌ చేశారు. ఆ రోజుని గుర్తు చేసుకంటూ, `నా జీవితంలో ఆగస్ట్ 22కి ఎంత ప్రాముఖ్యత ఉందో, సెప్టెంబర్‌ 22కి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఆగస్ట్ 22 నేను మనిషిగా ప్రాణం పోసుకున్న రోజైతే, సెప్టెంబర్‌ 22 నటుడిగా `ప్రాణం(ఖరీదు)` పోసుకున్న రోజు. నా తొలి చిత్రం విడుదలైన రోజు. నన్ను ఇంతగా ఆదరించి ఈ స్థాయికి చేర్చిన సినీ ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా నా ప్రాణానికి ప్రాణమైన నా అభిమానులందరికీ ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా` అని చిరంజీవి ఎమోషనల్‌గా ఈ ట్వీట్‌ చేశారు. 

42ఏళ్ళ సుధీర్ఘ సినీ జీవితంలో 151 చిత్రాల్లో నటించారు. గతేడాది తన డ్రీమ్‌ ప్రాజెక్ట్ `సైరా నరసింహారెడ్డి`తో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తుండగా, కాజల్‌ హీరోయిన్ గా నటిస్తుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios