చిరంజీవి ఈ నెల 22న పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. 65ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నారు. ఆయన పుట్టిన రోజంటే  ఓ పండగలాగా జరుపుకుంటారు అభిమానులు. ఆగస్ట్ నెల మొత్తం ఓ ఫెస్టివల్‌లాగా భావిస్తారు. చిరు కోసం ఫ్యాన్స్ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన పుట్టిన రోజుని పురస్కరించుకుని  అఖిల భారత చిరంజీవి యువత ఈ నెల 15 నుంచి భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. దీంతోపాటు రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ చిరు కోసం ప్రత్యేకంగా `మెగాస్టార్‌ మెగా ర్యాప్‌` పేరుతో ఓ స్పెషల్‌ సాంగ్‌ని విడుదల చేయబోతున్నారు. 

ఇంత చేస్తున్న అభిమానులకు చిరంజీవి కూడా గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే తాను ప్రస్తుతం నటిస్తున్న `ఆచార్య` చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ఒక్క గిఫ్ట్ తోనే సరిపట్టడం ఆయనకు నచ్చ లేదు. ఇంకా ఏదో చేయాలని డిసైడ్‌ అయ్యారు. మరి అదేంటో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

తాజాగా అదేంటో రివీల్‌ అయ్యింది. తన కొత్త ప్రాజెక్ట్ ని కూడా ప్రకటించాలని నిర్ణయించారట చిరు. ఈ మేరకు నిర్మాత, తన తనయుడు రామ్‌చరణ్‌తో చర్చించారట. అందులో భాగంగా తాను నెక్ట్స్ చేయబోయే సినిమాని అఫీషియల్‌గా అనౌన్స్ చేయాలని డిసైడ్‌ అయ్యారు. `లూసిఫర్‌` రీమేక్‌నిగానీ, బాబీతో చేయాల్సిన సినిమానిగానీ ప్రకటించాలనుకుంటున్నారు. లూసీఫర్‌కి సుజిత్‌ దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే. ఇదే నిజమైతే నిజంగానే చిరు తన అభిమానుల కోసం డబుల్‌ బోనాంజా ఇవ్వబోతున్నారని చెప్పొచ్చు. 

ఇక ప్రస్తుతం నటిస్తున్న `ఆచార్య`కి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా, ఇందులో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. రామ్‌చరణ్‌ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. తమన్నా గెస్ట్ రోల్‌లో మెరవనున్నట్టు టాక్‌. దీంతోపాటు రెజీనా ఐటెమ్‌ నెంబర్‌లో మెరవనున్నారు. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసం ఆర్‌ఎఫ్‌సీ ఏకంగా ప్రభుత్వ ఆఫీస్‌ సెట్‌ వేస్తున్నట్టు తెలుస్తుంది.