తాను క్యాన్సర్ బారిన పడ్డట్టు వస్తోన్న వార్తలపై చిరంజీవి క్లారిటీ.. భయభ్రాంతులకు గురి చేయోద్దంటూ హెచ్చరిక
చిరంజీవి క్యాన్సర్ బారిన పడ్డారు, దాన్నుంచి చికిత్స ద్వారా కోలుకున్నారనే వార్త ఇప్పుడు వైరల్‌గా , హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా దీనిపై మెగాస్టార్ స్పందించారు. వివరణ ఇచ్చారు.

`మెగాస్టార్ చిరంజీవి ఓ బాంబ్ పేల్చాడు, తాను క్యాన్సర్ బారిన పడ్డానని తెలిపారు`, `చిరంజీవికి క్యాన్సర్` ఇప్పుడిదే వార్త అటు ప్రధాన టీవీ మీడియాలో, ఇటు వెబ్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త. ఇది సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. మెగా అభిమానులు ఆందోళనకి గురి చేస్తుంది. చిరంజీవి క్యాన్సర్ బారిన పడటమేంటి? స్వయంగా ఆయనే వెల్లడించడమేంటి? అనేది సర్వత్రా హాట్ టాపిక్ అవుతుంది. అయితే ఈ వార్త చిరంజీవి వరకు వెళ్లింది. ఆయనకు తన వెల్ విషర్స్ నుంచి ఫోన్లు, మెసేజ్‌లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి స్పందించారు. వివరణ ఇచ్చారు.
తాజాగా చిరంజీవి ఓ ప్రైవేట్(స్టార్) హాస్పిటల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో క్యాన్సర్ గురించి అవగాహన గురించి మాట్లాడారు. తాను కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకోగా, అందులో రెండు పాలిప్స్ ని గుర్తించారట. అవి అలానే వదిలేస్తే మున్ముందు క్యాన్సర్‌కి దారి తీసే అవకాశం ఉందని, వాటిని ప్రారంభంలోనే తీయించుకున్నాడట చిరంజీవి. ఆ విషయాన్ని మీడియా ముఖంగా ఈ హాస్పిటల్ కార్యక్రమంలో వెల్లడించారు. అయితే దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని చిరంజీవి అంటున్నారు. చిరంజీవి క్యాన్సర్ బారిన పడ్డారు, చికిత్స ద్వారా కోలుకున్నారని వేయడాన్ని మెగాస్టార్ తప్పుపట్టారు. తాను చెప్పిన విషయాన్ని సరిగా అర్థం చేసుకోలేదని అన్నారు. తాజాగా ఆయన ట్వీట్ చేసి దీనిపై వివరణ ఇచ్చారు.
ఇందులో చిరంజీవి చెబుతూ, `కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్‌ని ప్రారంభించిన సందర్బంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను, రెగ్యూలర్‌గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను, నేను అలర్ట్ గా ఉండి, కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నా, అందులో నాన్-కాన్సరస్ పాలిప్స్ ని డిటెక్ట్ చేసి తీసేశారు అని చెప్పాను, `అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయి ఉంటే అది క్యాన్సర్ కింద మారేదేమో` అని మాత్రమే చెప్పాను, అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు చేయించుకోవాలి` అని మాత్రమే చెప్పాను` అని అన్నారు.
ఇంకా చిరంజీవి చెబుతూ, `కొన్ని మీడియా సంస్థ దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యంతో `నేను క్యాన్సర్ బారిన పడ్డాను` అని, `చికిత్స వల్ల బతికాను` అని స్కోలింగులు, వెబ్ ఆర్టికల్స్ పెట్టాయి. దీని వల్ల అనవసరమైన కన్‌ఫ్యూజన్ ఏర్పడింది. అనేక మంది వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్‌లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ క్లారిఫికేషన్. అలాంటి జర్నలిస్టులకి ఓ విజ్ఞప్తి. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు రాయకండి. దీనివల్ల అనేక మందిని భయభ్రాంతుల్ని చేసి బాధ పెట్టిన వారవుతారు` అంటూ పేర్కొన్నారు చిరంజీవి. దీంతో ఇది మరింతహాట్ న్యూస్‌గా మారింది.
ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ, పేదవారు, తమ అభిమానులు, సినిమా కార్మికుల్లో చాలా మంది పేదవారున్నారు. వారిలో క్యాన్సర్ వంటివి ముందుగా గుర్తించడం కోసం ఓ కార్యక్రమం ప్లాన్ చేయాలని, అందుకు తన వంతు సహాయం అందిస్తానని తెలిపారు మెగాస్టార్. స్క్రీనింగ్ టెస్ట్ లకు సంబంధించి అయ్యే ఖర్చులను తాను, తన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ భరిస్తుందని తెలిపారు.
వరుస సక్సెస్‌లో ఉన్న చిరంజీవి ప్రస్తుతం `భోళాశంకర్` చిత్రంలో నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటిస్తుంది. కీర్తిసురేష్ కీలక పాత్ర పోషిస్తుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 11న విడుదల కానుంది. ఇక ఇప్పటి ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. తొలి పాటని రేపు విడుదల చేయబోతున్నారు. శుక్రవారం ప్రోమోని రిలీజ్ చేయగా అది ఆకట్టుకుంది.