సినీ పరిశ్రమలో మెగా, నందమూరి హీరోలు తమ సత్తా చాటుతోన్న సంగతి తెలిసిందే. చిరంజీవి, బాలకృష్ణల పరంపరను వారి వారసులు కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోలుగా కొనసాగిన బాలయ్య, చిరంజీవిలు ఒక విమాన ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయి ఉండేవారట. కానీ వారు ఆ ప్రమాదం నుండి తప్పించుకొని తమ కుటుంబాలతో పాటు అభిమానుల్లో కూడా ఆనందాన్ని నింపారు.

ఈ సంఘటన జరిగింది 1993లో.. నేటితరం యువతకి దీని గురించి తెలిసి ఉండదు. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఈ సంఘటన గురించి ఓ కథనం రాసుకొచ్చారు. దాని ప్రకారం.. 1993 నవంబర్ 15 మద్రాస్ ఎయిర్ పోర్ట్ నుండి 272 మంది ప్రయాణికులతో ఓ విమానం ఉదయం ఆరుగంటల ప్రాంతంలో హైదరాబాద్ కి బయలుదేరింది. కాక్ పిట్ లో సీనియర్ పైలెట్ కెప్టెన్ భల్లా, కో పైలెట్ వేల్ రాజ్ ఉన్నారు.

ఆ రోజు విమానంలో చిరంజీవి, బాలకృష్ణ, ఈ ఇద్దరి హీరోల కుటుంబ సభ్యులు, విజయశాంతి, అల్లు రామలింగయ్య దంపతులు, మాలాశ్రీ, కమెడియన్ సుధాకర్, దర్శకులు బాపు, కోడిరామకృష్ణ, రచయితలు పరుచూరి వెంకటేశ్వరావు, ఇలా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ప్రముఖులు ఉన్నారు. విమానంలో ఎక్కువమంది సినిమావాళ్లే కావడంతో సందడి వాతావరణం నెలకొంది. ప్రయాణం మొదలైన కాసేపటికే చాలా మంది నిద్రలోకి జారుకున్నారు.

విమానం బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కి చేరుకోగానే ప్రయాణికులు దిగడానికి సిద్ధమవుతున్నారు. కానీ మంచు కారణంగా రన్ వే కనిపించకపోవడంతో తిరిగి మద్రాస్ కు వెళ్తున్నట్లు ఎయిర్ హోస్టెస్ ప్రయాణికులకు చెప్పింది. చేసేదేంలేక అందరూ చెన్నైకి వెళ్లడానికి సిద్ధమయ్యారు. చిరంజీవి తన ఒళ్లో కూతురు శ్రీజని కూర్చోపెట్టుకొని 
కబుర్లు చెబుతున్నారు.

బాలకృష్ణ కూడా తన పిల్లలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా ఉండగా.. కో పైలెట్ టెన్షన్ గా ఎయిర్ హోస్టెస్ తో మాట్లాడడం గమనించాడు చిరంజీవి. ఏమైందని ప్రశ్నించగా.. టెక్నికల్ సమస్య వచ్చిందని చెప్పారు. ప్రతికూల పరిస్థితుల కారణంగా విమానం తిరుపతికి వెళ్లడం లేదని అర్ధమయింది. విమానం రెక్కల విషయంలో సమస్య రావడం, మద్రాస్ చేరుకోవడానికి కావాల్సిన ఇంధనం లేకపోవడంతో ఏం జరుగుతుందోనని అందరూ టెన్షన్ తో ఉన్నారు.

మరికొంతమంది కాసేపట్లో చనిపోతున్నామని ఏడవడం మొదలుపెట్టేశారు. కానీ కెప్టెన్ భల్లా ఎమర్జెన్సీ లాండింగ్ అని అనౌన్స్ చేసి నెల్లూరు జిల్లా వేంకటగిరికి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పల్లెటూరి పొలాల్లో విమానాన్ని ల్యాండ్ చేశారు. విమానం వేగానికి చాలా సేపు అలాగే నేల మీద దూసుకుపోయింది. ఎమర్జెన్సీ తలుపులు తెరుచుకోకపోవడంతో వెంటనే చిరంజీవి, బాలకృష్ణ ఎయిర్ హోస్టెస్ లకు సహాయం చేశారు.

ఆ విధంగా విమాన ప్రమాదం నుండి తప్పించుకున్నారు మన తారలు. ఆరోజు పైలెట్ గనుక రిస్క్ తీసుకొని ఉండకపోతే ఈరోజు మన తారలు వారి అభిమానులు ఏమై ఉండేవారో.. ఆలోచించడానికే కష్టంగా ఉంది. సదరు పైలెట్ ని సినీ ప్రముఖులంతా ఘనంగా సత్కరించారని తెలుస్తోంది.