ప్రముఖ సీనియర్ నటుడు మురళీమోహన్ వెన్నెముకకు ఇటీవల ఆపరేషన్ జరిగింది. ఆయన వెన్నెముకలోని ఎల్ 4, ఎల్ 5, ఎల్ 6 వద్ద నరాలు ఒత్తిడికి గురవుతుండడంతో వైద్యులు ఆయనకి ఆపరేషన్ నిర్వహించారు.

డాక్ట‌ర్స్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మే 24న కేర్ ఆసుప‌త్రిలో ఆప‌రేష‌న్ విజ‌య‌వంతంగా ముగిసింది. వారం రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న మురళీమోహన్.. నిన్న రాత్రి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు మురళీమోహన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు.

ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. తనకు ఆపరేషన్ జరిగిన విషయాన్ని వివరిస్తూ మురళీమోహన్ ఓ వీడియో విడుదల చేశారు. ఈ నెల 10 తరువాత తన ఆరోగ్యం బాగుంటే తనే స్వయంగా రాజమండ్రిలోని సన్నిహితులు, పార్టీ వర్గాలను, అభిమానులను కలుసుకుంటానని.. తను కోలుకోవడానికి సమయం పడితే ఒక్కొక్కరుగా వచ్చి తనను కలవచ్చని ఆయన సూచించారు.