Asianet News TeluguAsianet News Telugu

ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి అంతటి చరిత్ర ఉందా..

  • ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి కన్ఫమ్
  • ఇంతకీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు.. చరిత్రేంటి
CHIRANJEEVI AS VUYYALA VADA NARASIMHA REDDY

మెగాస్టార్ చిరంజీవి 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమాలో నటించబోతున్నారని.. మెగాస్టార్ సన్నిహితుడు, ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ కూడా కన్ఫమ్ చేసారు. అఫ్ కోర్స్... మెగా స్టార్ స్వయంగా నాగార్జునను పిలిచినప్పుడు మీలో ఎవరు కోటీశ్వరుడు షోలోనే స్వయంగా ప్రకటించారనుకోండి. మరి అసలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు. ఆయన వివరాలేంటి.

 

1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు పాలకులను ఎదిరించిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మన తెలుగువాడు. 18వ శతాబ్దపు తొలిదినాల్లో రాయలసీమలో పాలెగాళ్ళ వ్యవస్థ ఉండేది. కడప జిల్లాలోనే 80 మంది పాలెగాళ్ళుండేవారు. నిజాము నవాబు రాయలసీమ ప్రాంతాలను బ్రిటిషు వారికి అప్పగించడంతో పాలెగాళ్ళు బ్రిటిషు ప్రభుత్వం అధీనంలోకి వచ్చారు. బ్రిటిషు ప్రభుత్వం వారి ఆస్తులు, మాన్యాలపై కన్నేసి, వాటిని ఆక్రమించుకునే ఉద్దేశ్యంతో, వారి అధికారాలకు కోత విధిస్తూ పాలెగాళ్ళ వ్యవస్థను రద్దుచేసి, వారికి నెలవారీ భరణాల ఏర్పాటు చేసింది. ఉయ్యాలవాడ గ్రామం ఇప్పటి కర్నూలు జిల్లాలో ఉంది. ఉయ్యాలవాడకు పాలెగాడు గా నరసింహారెడ్డి తండ్రి పెదమల్లారెడ్డి ఉండేవాడు.

 

నరసింహారెడ్డి తాత, నొస్సం జమీందారు అయిన చెంచుమల్ల జయరామిరెడ్డి సంతానం లేకపోవడంతో నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నాడు. తండ్రి తరపున నెలకు 11 రూపాయల, 10 అణాల, 8 పైసలు భరణంగా వచ్చేది. అయితే తాతగారైన, జయరామిరెడ్డి నిస్సంతుగానే కాలం చేశాడనే నెపంతో ఆయనకు ఇస్తూ వచ్చిన భరణాన్ని ఆయన మరణంతో రద్దుచేసింది బ్రిటిషు ప్రభుత్వం.

 

1846 జూన్‌లో నరసింహారెడ్డి తన నెలసరి భరణం కొరకు అనుచరుణ్ణి కోయిలకుంట్ల ఖజానాకు పంపగా, అక్కడి తాసీల్దారు ఇవ్వను పొమ్మనడంతో నరసింహారెడ్డి తిరుగుబాటు మొదలైంది. మాన్యాలు పోగొట్టుకున్న ఇతర కట్టుబడి దారులు కూడా రెడ్డి నాయకత్వంలో కూటిమిగా చేరారు. వనపర్తి, మునగాల, జటప్రోలు, పెనుగొండ, అవుకు జమీందార్లు, హైదరాబాద్ కు చెందిన సలాం ఖాన్, కర్నూలుకు చెందిన పాపాఖాన్, కొందరు బోయలు, చెంచులు కూడా నరసింహారెడ్డితో చేరినవారిలో ఉన్నారు.

 

1846 జూలై 10వ తేదీ రెడ్డి 500 మంది బోయ సైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడిచేసి ఖజానాలోని 805 రూపాయల, 10 అణాల, 4 పైసలను దోచుకున్నాడు. ప్రొద్దుటూరు సమీపంలోని దువ్వూరు ఖజానాను కూడా దోచుకున్నాడు. బ్రిటిషు ప్రభుత్వం రెడ్డిని పట్టుకోవడానికి సైన్యాన్ని దింపింది. కెప్టెన్ నాట్, కెప్టెన్ వాట్సన్‌ల నాయకత్వాల్లో వచ్చిన దళాలు రెడ్డిని పట్టుకోలేక వెనుదిరిగాయి. ఇక చివరి అస్త్రంగా బ్రిటిషు ప్రభుత్వం రెడ్డిని పట్టి ఇచ్చినవారికి వేయిరూపాయల బహుమానాన్ని ప్రకటించింది.

 

తరువాత జూలై 23న తేదీన కెప్టెన్ వాట్సన్ నాయకత్వంలో వచ్చి గిద్దలూరు వద్ద విడిది చేసి ఉండగా, అర్ధరాత్రి రెడ్డి, తన సైన్యంతో విరుచుకుపడి బ్రిటిషు సైన్యాన్ని పారదోలాడు. నరసింహారెడ్డి కుటుంబాన్ని పట్టుకుని కడపలో ఖైదుచేసింది ప్రభుత్వం. వారిని విడిపించుకునేందుకు కడప చేరాడు రెడ్డి. 1846 అక్టోబర్ 6న నల్లమల కొండల్లోని పేరుసోమల వద్దగల జగన్నాథాలయంలో ఉన్నాడని తెలుసుకున్న కడప యాక్టింగ్ కలెక్టర్ కాక్రేన్ సైన్యంతో ముట్టడించి రెడ్డిని బంధించింది.

 

నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమేకాక, హత్యలకు, దోపిడీలకు, పాల్పడినట్లు తీర్పు చెబుతూ, ఉరిశిక్ష విధించాడు 1847 ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బహిరంగంగా ఉరితీసింది బ్రిటిషు ప్రభుత్వం. విప్లవకారులని భయభ్రాంతులను చేయడానికి నరసింహారెడ్డి తలను 1877 దాకా కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వ్రేలాడదీసే ఉంచారు.

 

ఇంతటి చరిత్ర గల ఘనుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి సినిమాను చిరంజీవి హీరోగా కలిసి సురేందర్ రెడ్డి ఎలా తెరకెక్కిస్తాడోననే సర్వత్రా ఆసక్రి పెరిగింది. ఉయ్యాలవాడ నరిసింహారెడ్డి కథను మెగాస్టార్ చిరంజీవి సినిమాకు సరిపోయే విధంగా.... ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ స్క్రిప్టు వర్క్ చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios