ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ తో మెగాస్టార్ చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వై ఎస్ జగన్ని తన నివాసంలో చిరంజీవి సతీసమేతంగా కలిసి అభినందించారు. అలాగే జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని కూడా చిరంజీవి సమర్ధించారు. కరోనా సమయంలో చిత్ర పరిశ్రమ ఇబ్బందులకు గురికాగా, జగన్ ని చిత్ర ప్రముఖులతో పాటు చిరంజీవి కలిశారు. షూటింగ్స్ నిర్వహణకు అనుమతులు వంటి విషయాలతో పాటు, చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సాయం చేయాలని ఆయనను కోరడం జరిగింది. 
 
పరిశ్రమ ప్రముఖుల వినతులను స్వీకరించిన సీఎం జగన్... సానుకూలంగా స్పందించారు. ఆ సందర్భంలో కూడా చిరంజీవి, సీఎం జగన్ కి ధన్యవాదాలు తెలిపారు. కాగా మరోమారు సోషల్ మీడియా వేదికగా సీఎం జగన్ ని పొగడ్తలలో ముంచెత్తాడు చిరంజీవి. దాదాపు ఏడు నెలలకు పైగా థియేటర్స్ మూతపడి ఉండగా, థియేటర్స్ యాజమాన్యాలు, ఎగ్జిబిటర్స్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. ఆదాయం లేక, వడ్డీల భారం వలన తీవ్ర నష్టాలను చవిచూశారు. 
 
ఈ నేపథ్యంలో సినిమాస్ రెస్ట్ ప్యాకేజీని జగన్ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. దీనితో సీఎం జగన్ ఉదార స్వభావానికి,  థియేటర్స్ మనుగడ కోసం చేపట్టిన చర్యలకు చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. సినిమా థియేటర్స్ పునరుద్దరణ కొరకు అనేక చర్యలు చేపట్టాలని, చిత్ర పరిశ్రమపై ఆధారపడిన లక్షల మందికి జీవనోపాధి దొరుకుతుందని ఆయన తన ట్వీట్ లో తెలియజేశారు. సినిమా పరిశ్రమ భవిష్యత్ థియేటర్స్ మనుగడపైనే ఆధారపడి ఉంది. భారీ చిత్రాలు తెరకెక్కాలంటే థియేటర్స్ విడుదల తప్పనిసరి.