Asianet News TeluguAsianet News Telugu

చిరంజీవి ఆటోబయోగ్రఫీ.. రాసేది ఎవరో తెలుసా?

మెగాస్టార్‌ చిరంజీవి జీవితం పుస్తక రూపంలోకి రాబోతుంది. ఆయనపై ఆటోబయోగ్రఫీ రానుంది. తాజాగా చిరంజీవి ఈ విషయాన్ని ప్రకటించారు. మరి ఎవరు రాయబోతున్నారంటే..

chiranjeevi announces autobiography into book who will write ? arj
Author
First Published Jan 20, 2024, 7:05 PM IST

టాలీవుడ్‌కి పునాది వంటి పెద్ద స్టార్లపై పుస్తకాలు వచ్చాయి. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, కృష్ణంరాజు వంటి వారిపై పుస్తకాలు రాశారు రచయితలు, జర్నలిస్టులు. వీరిలో ఒక్కొక్కరు ఒక్కో యాంగిల్‌లో తీసుకుని పుస్తకాలు రాశారు. చిరంజీవిపై కూడా కొన్ని పుస్తకాలు వచ్చాయి. కానీ పూర్తిగా ఆయన జీవితాన్ని ఆవిష్కరించే `ఆటో బయోగ్రఫీ` రాలేదు. తాజాగా ఆ పుస్తకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. త్వరలో మెగాస్టార్‌ చిరంజీవి ఆటోబయోగ్రఫీ రాబోతుంది. అది ఒక స్టార్‌ రైటర్‌ రాయబోతున్నారు. 

ఎన్నో పుస్తకాలు రాసి స్టార్‌ రైటర్‌గా పేరుతెచ్చుకున్న యండమూరి వీరేంద్రనాథ్‌.. ఈ పుస్తకాన్ని రాయబోతుండటం విశేషం. తాజాగా చిరంజీవి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్‌ 28వ వర్థంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లను గుర్తు చేసుకుంటూ ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో చిరంజీవి మాట్లాడుతూ యండమూరి వీరేంద్రనాథ్‌ పై ప్రశంసలు కురిపించారు. ఆయన సినిమాల్లో ఆయన పాత్ర ఎంతో ఉందని, ఆయన రాసిన పుస్తకాల ఆధారంగానే ఎన్నో సినిమాలు చేసినట్టు తెలిపారు. 

ఒక రకంగా తనకు స్టార్‌ డమ్‌ తెచ్చిన సినిమాలకు ఆయన రాసిన స్టోరీలే కారణమన్నారు. 80వ దశకంలో చాలా వరకు ఆయన రాసిన రచనలు, కథలు, పాత్రలు తనకు స్టార్‌ డమ్‌ రావడంలో కీలక పాత్ర పోషించాయని చెప్పారు. ఆ క్రెడిట్‌ యండమూరికే దక్కుతుందని చెప్పారు. మెగాస్టార్‌ అనే పేరు వచ్చింది కూడా ఆయన సినిమానే కారణమన్నారు చిరు. `అభిలాష` పుస్తకాన్ని తన అమ్మ ముందుగా చదివి చెప్పిందని, ఆ రెండు మూడు రోజులకే మద్రాస్‌లో అదే కథతో కేఎస్‌ రామారావు తనతో సినిమా చేసేందుకు వచ్చారని తెలిపారు. అందులో హీరో పాత్ర కూడా చిరంజీవినే అని, అది కాకతాళియమో ఏమోగానీ, ఆ సినిమా నేను చేయడం అదృష్టంగా భావిస్తున్నా, ఆ సినిమా పెద్ద విజయం సాధించి తనలో నమ్మకాన్ని పెంచిందని, ఇక మనకు తిరుగులేదనే నమ్మకాన్ని ఇచ్చిందని తెలిపారు మెగాస్టార్‌. 

`ఛాలెంజ్‌` మూవీ ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిందని, చాలా మంది ఆ సినిమా చూసి ఇప్పటికీ ప్రశంసిస్తుంటారని తెలిపారు. `మరణమృధంగం`, `రక్త సింధూరం` వంటి ఎన్నో సినిమాలు చేశానని, తన ఎదుగుదలలో, స్టార్‌ డమ్‌లో ఆయనది సింహభాగం అని తెలిపారు చిరు. ఈ సందర్భంగా తన ఆటో బయోగ్రఫీ ప్రస్తావన వచ్చింది. తన ఆటోబయోగ్రఫీని తాను రాసుకోలేనని, అంత టైమ్‌ లేదని, ఆ బాధ్యత యండమూరి తీసుకుంటానని మాట ఇచ్చారని తెలిపారు. అంతేకాదు అధికారికంగానూ ఈ విషయాన్ని ప్రకటించారు చిరు. తన ఆటోబయోగ్రఫీ యండమూరి వీరేంద్రనాథ్‌ రాయబోతున్నట్టు చెప్పారు. ఈ లెక్కన త్వరలోనే చిరంజీవి ఆటోబయోగ్రఫీ పుస్తక రూపంలోకి రాబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios