ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా వైరస్‌కి గురై చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని తెలిసింది. అయితే ప్రస్తుతం ఆయన ట్రీట్‌మెంట్‌కి సపోర్ట్ చేస్తున్నారని, ఆరోగ్యం బాగానే ఉందని, కాస్త కోలుకుంటున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. 

ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న వార్తతో ఆయన అభిమానులు, సినీ వర్గాలు ఆందోళనకు గురయ్యాయి. త్వరగా కోలుకోవాలని, పాటతో నవ్వుకుంటూ బయటకు రావాలని కోరుకుంటున్నారు. కరోనాతో పోరాడి విజయం సాధించాలని, మళ్ళీ పాటతో శ్రోతలను అలరించాలని వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చిరంజీవి కూడా స్పందించారు. త్వరగా కోలుకోవాలని ట్వీట్‌ చేశారు. `అన్నయ్య బాలుగారు, మీరు త్వరగా కోలుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, మీ కోసం ప్రార్థనలు చేస్తున్నాను` అని ట్వీట్‌ చేశారు చిరు. 

మరోవైపు బాలు స్నేహితుడు, దిగజ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇళయరాజా స్పందిస్తూ, `బాలు త్వరగా లేచిరా. నీ కోసం కాచుకుని కూర్చున్నాను. మన ప్రయాణం. సినిమాతో ప్రారంభం కాలేదు. అలాగే సినిమాతో ముగిసిపోయేది కాదు. సంగీతం మన జీవితానికి ఓ ఆధారంగానే నిలిచింది. స్టేజీ కచేరీలపై ప్రారంభమైన మన స్నేహం, సంగీతం ఒకదాన్ని ఒకటి విడిచి ఎలా ఉండలేదో, అలాగే మన స్నేహం ఎప్పుడూ విడిచిపోలేదు. మన మధ్య గొడవ ఉన్నా, లేకున్నా అది స్నేహమే, ఈ విషయం మన ఇద్దరికీ బాగా తెలుసు. నువ్వు కచ్చితంగా తిరిగి వస్తావని నా మనసు చెబుతుంది. అది నిజంగా జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. త్వరగా రా బాలు` అని వీడియోని షేర్‌ చేశారు.