చిరంజీవి 45ఏళ్ల జర్నీపై రామ్‌చరణ్ ఎమోషనల్ పోస్ట్.. ఆ మూమెంట్‌ని సెలబ్రేట్ చేసుకోలేకపోతున్న మెగాస్టార్..
చిరంజీవి 45ఏళ్ల సినిమా కెరీర్‌ని పూర్తి చేసుకున్న సందర్భంగా సినీ సెలబ్రిటీలు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. రామ్‌చరణ్ ట్విట్టర్ ద్వారా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

మెగాస్టార్ చిరంజీవి.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి.. నటుడిగా రాణించాడు, హీరోగా ఎదిగాడు. స్టార్, సూపర్ స్టార్ నుంచి మెగాస్టార్ గా ఎదిగారు. ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగారు. టాలీవుడ్‌కి ఒకే ఒక్క మెగాస్టార్ అనే బిరుదుని సొంతం చేసుకున్నారు. అంతటి ఘన కీర్తిని పొందుతున్న చిరంజీవి సినిమా జర్నీ 45ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు(సెప్టెంబర్ 22) ప్రారంభం కావడం విశేషం. ఆయన నటించిన తొలి చిత్రం `ప్రాణం ఖరీదు` చిత్రం 1978 సెప్టెంబర్ 22న విడుదలైంది. ఆ సినిమాతోనే చిరంజీవి వెండితెరకి పరిచయం అయ్యారు. శివ శంకర వరప్రసాద్ కాస్త చిరంజీవి అయ్యారు.
చిరంజీవి 45ఏళ్ల సినిమా కెరీర్‌ని పూర్తి చేసుకున్న సందర్భంగా సినీ సెలబ్రిటీలు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. రామ్‌చరణ్ ట్విట్టర్ ద్వారా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇందులో తండ్రిని కీర్తిస్తూ హార్ట్ టచ్చింగ్ వర్డ్స్ రాసుకొచ్చారు. `సినీ పరిశ్రమలో 45 సంవత్సరాల మెగా జర్నీని పూర్తి చేసుకున్న మన ప్రియమైన మెగాస్టార్‌కి హృదయపూర్వక అభినందనలు. ఆయన ప్రయాణం ఎంతో గొప్పది. `ప్రాణం ఖరీదు`తో ప్రారంభమైన ఈ జర్నీలో ఆయన మనల్ని ఇప్పటికీ అబ్బురపరుస్తూనే ఉన్నారు. వెండితెరపై అద్భుతమైన నటనతో, బయట మీ మానవత్వంతో కూడిన మీ కార్యకలాపాలను కొనసాగిస్తూ కొన్ని కోట్ల మందిని ఇన్‌స్పైర్ చేస్తూనే ఉన్నారు. క్రమశిక్షణ, కష్టించే తత్వం, అంకిత భావం వంటి విలువలతో పాటు వాటన్నింటినీ మించి మాలో కరుణను పెంపొందించిన నాన్నకి ధన్యవాదాలు` అని తెలిపారు చరణ్.
మరోవైపు సాయిధరమ్ తేజ్ సైతం ఎమోషనల్ నోట్‌ని పంచుకున్నారు. `45ఏళ్ల మెగా ప్రస్థానం, చరిత్రకిది ఏమాత్రం తక్కువ కాదు. ఇక్కడి నుంచి సినిమా ఆకాశం వరకు. మీరు మమ్మల్ని ఎంతో ఇన్ స్పైర్ చేశారు, ఒక టార్చ్ బేరర్‌లా నిలిచారు. మాకోసం అనేక మెట్లు వేశారు. మీ అద్భుతమైన, అసాధారణమైన జర్నీకి అభినందనలు పెద్ద మామ చిరంజీవి. మాకు మంచి విలువలు, క్రమశిక్షణ నేర్పించినందుకు ధన్యవాదాలు` అని పేర్కొన్నారు.
తెలుగు సినిమాకి కమర్షియల్ హద్దులు అద్దిన హీరో చిరంజీవి. సినిమా స్కేల్‌ని పెంచిన హీరో. డాన్సులు పరిచయం చేసి కొత్త పుంతలు తొక్కించారు. అనేక విషయాలకు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. తన నాలుగున్న దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో మైలు రాళ్లు అందుకున్నారు. కొత్త తరానికి సినిమా బాటలు వేశారు. హీరోగానే కాకుండా మంచి మానవతా వాదిగా నిలిచారు. ఎంతో మందికి సేవ చేస్తున్నారు. తన బ్లడ్ బ్యాంక్ ద్వారా, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలందిస్తున్నారు. సినిమా పరిశ్రమ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నారు.
అయితే తన 45ఏళ్ల సినిమా జీవితం అంటే అదొక అద్భుతమైన మూమెంట్. ఎంతో సెలబ్రేట్ చేసుకోవాల్సిన సందర్భం. కానీ ఇప్పుడు ఆ స్థితిలో చిరంజీవి లేకపోవడం బాధాకరం. ఆయన కెరీర్‌లో జయాపజయాలు కామనే. కానీ సక్సెస్ ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసుకోవడం వేరు, ఫెయిల్యూర్‌లో ఉన్నప్పుడు ఆ సెలబ్రేషన్ వేరు. ఇటీవల `భోళాశంకర్`తో పెద్ద పరాజయం చవిచూసిన చిరంజీవి తన 45ఏళ్ల సినీ ప్రస్థానాన్ని మనస్ఫూర్తిగా సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నారనేది వాస్తవం.