బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌ని ఫైర్‌ బ్రాండ్‌ అన్నట్టు టాలీవుడ్‌లో గాయని, డబ్బింగ్‌ ఆర్టిస్టు చిన్మయి మారుతున్నారు. రెండేళ్ళ క్రితం తమిళంలో లైంగిక వేధింపుల విషయాలను బయటపెట్టి సంచలనం సృష్టించింది. సాహిత్య రచయిత వైరముత్తుపై లైంగిక ఆరోపణలు చేశారు. 

తాజాగా మరోసారి వైరముత్తుపై విరుచుకుపడింది చిన్మయి. అయితే ఈ సారి ఓ మహిళ వైరముత్తుపై ఆరోపణలు చేసింది. ఆమె తన ఫ్యామిలీ వల్ల తలెత్తే సమస్యల కారణంగా తన పేరు బయటకు రావద్దని చిన్మయికి తెలిపింది. దీంతో ఆమె పోస్ట్ ని చిన్మయి తన ట్విట్టర్‌ ద్వారా పోస్ట్ చేసింది. ఆ మహిళ పంపిన స్క్రీన్‌ షాట్‌ని చిన్మయి పంచుకుంది. 

ఈ సందర్భంగా చిన్మయి చెబుతూ, దాదాపు రెండేళ్ళు పూర్తయ్యింది. అయినా ఇంకా `మీటూ` ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ మహిళ తనకు ఎదురైన వేధింపులు నాకు చెప్పడానికి రెండేళ్ళ సమయం పట్టింది. కుటుంబ సభ్యుల మద్దతు లేకపోవడం వల్ల ఇన్నాళ్ళూ మౌనంగా ఉంది. ఆమె నాకు చాలా రోజులుగా తెలుసు. అయినా ఇలాంటి సమస్యల్ని మన సమాజం, ప్రజలు పట్టించుకోరు కదా?` అని తెలిపింది. 

ఇక ఆమె పంచుకున్న పోస్ట్ ని చూస్తే, ``మీటూ` ఉద్యమం నుంచి మీకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నా. కానీ మా అత్తామామలు అనుమతించకపోవడంతో చెప్పలేకపోయా. దయజేసి నా పేరు బయటపెట్టొద్దు. నేను కాలేజ్‌లో ఉన్న రోజుల్లో ఓ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్ళాను. అక్కడ వైరముత్తు ఆటోగ్రాఫ్‌ తీసుకున్నా. ఆయన ఫోన్‌ నెంబర్‌ రాశారు. అప్పుడు చాలా చిన్నదాన్ని. ఆ నెంబర్‌ ఎందుకిచ్చారో నాకు అర్థం కాలేదు` అని తెలిపింది.

ఇంకా చెబుతూ, `కొన్నాళ్ల తర్వాత ఓ ప్రముఖ తమిళ ఛానెల్‌లో పనిచేస్తున్న సమయంలో వైరముత్తు నన్ను కలిశారు. నా ఫోన్‌ నెం.అడిగారు. ఇలాంటివి వేధింపులు నేను ఊహించలేదు. ఆయన అడిగిన వెంటనే నా ఫోన్‌ నెం ఇచ్చారు. ఆ క్షణం నుంచి నాకు ఆయన్నుంచి వరుసగా ఫోన్స్, మెసేజెస్‌ వస్తూనే ఉన్నాయి. ఆయన అసలు రూపం తెలుసుకుని షాక్‌ అయ్యాన`ని తెలిపింది. 

`మౌంట్‌ రోడ్డు దగ్గరున్న ఓ చోటుకు రమ్మని పిలుస్తూనే ఉన్నాడు. నేను పట్టించుకోలేదు. అయినా ఫోన్‌ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఫోన్‌ నెంబర్‌ మార్చినా తెలుసుకుని చేసేవారు. మా ఛానెల్‌ యాజమాన్యం ఆయన భార్యతో చెప్పారు. ఆ తర్వాత వైరముత్తు నోరు ఆగింది` అని పేర్కొంది. వైరముత్తుపై గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఆయన పేరు బయటకు రావడంతో లైంగిక వేధింపులకు సంబంధించిన `మీటూ` ఉద్యమం మరోసారి ఊపందుకుంటుందని చెప్పొచ్చు.