తెలుగులో ఘనవిజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రంలో హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ అయింది. తెలుగు వర్షన్ దర్శకుడు సందీప్ రెడ్డే కబీర్ సింగ్ చిత్రాన్ని కూడా తెరక్కించాడు. కబీర్ సింగ్ చిత్రం 200 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించా ఆ కథపై వివాదాలు చెలరేగుతున్నాయి. 

కబీర్ సింగ్ చిత్రంలో రొమాన్స్ డోస్ ఇంకా పెంచేశారు. ఇందులోని బోల్డ్ కంటెంట్ పై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే.. మహిళల్ని కించపరిచే విధంగా కబీర్ సింగ్ చిత్రం ఉందంటూ విమర్శలు చెలరేగుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత వివాదంగా మారుతున్నాయి. 

కబీర్ సింగ్ చిత్రం, తాజాగా సందీప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మహిళల్ని అవమానించేలా ఉన్నాయంటూ ప్రముఖ గాయని చిన్మయి ట్విటర్ వేదికగా ఫైర్ అయ్యారు. సందీప్ రెడ్డి మాట్లాడిన వీడియో పోస్ట్ చేసి దుయ్యబట్టారు. ప్రేమలో ఉన్న ప్రేమికులిద్దరూ ఒకరినొకరు టచ్ చేసే చనువు ఉండాలి. అవసరమైతే ఒకరినొకరు కొట్టాలి. ఆ చనువు ప్రేమికుల మధ్య ఉండాలి. అలా లేకుంటే వారి మధ్య ప్రేమ లేనట్లే అర్థం అని సందీప్ కామెంట్స్ చేశాడు. 

ఈ వీడియో పోస్ట్ చెసిన చిన్మయి.. ఒకరినొకరు కొట్టుకోవాలా.. నేను, నా భర్త ప్రేమలో ఉన్నాం.. నా భర్త నన్నెప్పుడూ కొట్టలేదు. నాపై ఉన్న ప్రేమని నిరూపించుకోవడానికి ఆయన నన్ను కొట్టాలా అని చిన్మయి ప్రశ్నించింది. ఇలాంటి సినిమాలు, కామెంట్స్ వల్ల మన పిల్లలు కూడా అలాగే తయారవుతారని చిన్మయి మండిపడింది.