నటి భాను ప్రియపై తాజాగా చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో భానుప్రియపై సామర్లకోట పోలీసులు నమోదు చేసిన కేసు ఇప్పుడు చెన్నై పోలీసుల చేతికి మారింది. చెన్నైలో నివసిస్తోన్న భానుప్రియ తన ఇంటి పని కోసం మైనర్ అమ్మాయిలను నియమించుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

అయితే తన ఇంట్లో పని చేసే పిల్ల దొంగతనానికి పాల్పడిందంటూ గత జనవరి 19న స్థానిక పాండిబజార్ పోలీస్ స్టేషన్ లో నటి భానుప్రియ, ఆమె సోదరుడు గోపాలకృష్ణన్ ఫిర్యాదు చేశారు. ఇంటి పని అమ్మాయే దొంగతం చేసి ఉంటుందని ఆమెపై కేసు నమోదు చేయాలని భానుప్రియ పేర్కొంది. అయితే ఆ పని అమ్మాయి తల్లి ప్రభావతి సామర్లకోట పోలీసులకు నటి భానుప్రియ, ఆమె సోదరుడిపై ఫిర్యాదు చేసింది. 

తన కూతురిని ఇంట్లో నిర్భంధించి చిత్రవధకు గురిచేస్తున్నారని.. తన కూతురిని రక్షించాలని కోరింది. ఈ క్రమంలో సామర్లకోట పోలీసులు  చెన్నైకి వెళ్లి భానుప్రియను విచారించారు. అదే సమయంలో భానుప్రియ పెట్టిన కేసులో చెన్నై, పాండిబజార్‌ పోలీసులు పనిపిల్ల, తల్లి ప్రభావతిని అరెస్ట్‌ చేసి విచారించారు. తాజాగా సామర్లకోట పోలీసులు ఈ కేసుని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చారు.

నేరం జరిగింది చెన్నైలో కాబట్టి నటి భానుప్రియపై బాల కార్మికుల చట్టం కింద వారు నమోదు చేసిన కేసును చెన్నై పోలీసులకు ఇటీవల తరలించారు. దీంతో చెన్నై, పాండిబజార్‌ పోలీసులు ఆ కేసుకు సంబంధించి నటి భానుప్రియ,ఆమె సోదరుడు గోపాలకృష్ణన్‌పై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు ఎప్పుడైనా భానుప్రియను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందంటూ ప్రచారం జరుగుతోంది.