చైల్డ్ ఆర్టిస్టులుగా నటనలో ప్రతిభ కనబర్చడం అంత సులువు కాదు. చిన్న వయసులోనే నటించాలంటే ఎంతో పరిణితి ఉండాలి. పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తేజని తెలుగు ప్రేక్షకులు మరచిపోలేరు. యువరాజు, కలిసుందాం రా, ఇంద్ర, వసంతం, ఠాగూర్ లాంటి చిత్రాల్లో తేజ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు. ముఖ్యంగా మెగాస్టార్ ఇంద్ర చిత్రంలో టైటిల్ పడే సన్నివేశంలో తేజ నటన విజిల్స్ కొట్టించే విధంగా ఉంటుంది. 

సీమలో ఒక్క మగాడు కూడా లేడా అని తెలంగాణ శకుంతల అడగగా బ్యాగ్ విసిరికొట్టి నేనున్నానే నానమ్మా అంటూ తేజ ఇచ్చే ఎంట్రీ అదుర్స్. ఈ బుడతడే త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అందుకు తగ్గట్లుగా తన ఫిజిక్ ని మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక తేజ కలిసుందాం రా చిత్రంలో కూడా తన అల్లరితో మెప్పించాడు. ఠాగూర్ లో సునీల్ పై తేజ వేసే జోకులు కూడా బావుంటాయి. 

ప్రస్తుతం సమంత నటిస్తున్న ఓ బేబీ చిత్రంలో తేజ కూడా నటిస్తున్నాడు. తేజ హీరోగా నటించే చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. సో ఈ బుల్లి ఇంద్రసేనారెడ్డిని త్వరలో హీరోగా చూడొచ్చు.