నటీనటులు: సుశాంత్, రుహాని శర్మ, వెన్నెల కిషోర్                                               
సంగీతం: ప్రశాంత్ విహారీ                    
ఛాయాగ్రహణం: ఎం.సుకుమార్                                     
నిర్మాత: నాగార్జున-జశ్వంత్ నడిపల్లి        
దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్                      

హీరోగా కెరీర్ మొదలుపెట్టి పదేళ్లు దాటుతున్నా.. ఇప్పటివరకు సరైన హిట్ ను మాత్రం అందుకోలేకపోయారు సుశాంత్. అక్కినేని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఏ సినిమా కలిసి రాలేదు. ఎన్నో ఆశలు పెట్టుకొని నటించిన 'ఆటాడుకుందాం రా' సినిమా కూడా ఫ్లాప్ కావడంతో డీలా పడిపోయాడు. అయితే రాహుల్ రవీంద్ర చెప్పిన కథ ఆసక్తికరంగా అనిపించడంతో అతడి దర్శకత్వంలో సినిమా చేశాడు. అదే 'చిలసౌ'. నటుడైన రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మరి ఈ సినిమా ఈ ఇద్దరికి ఎలాంటి సక్సెస్ అందించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ: 
27 ఏళ్ల అర్జున్(సుశాంత్)కి పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్లు ప్రయత్నిస్తుంటారు. తను మాత్రం ఇప్పట్లో పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పేస్తుంటాడు. కానీ ఇంట్లో వాళ్లు, ఫ్రెండ్స్, బంధువులు అందరూ పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని అడుగుతూనే ఉంటారు. దీంతో విసిగిపోయిన అర్జున్ ఐదేళ్ల సమయం కావాలని తప్పించుకొని తిరుగుతుంటాడు. కానీ తన తల్లి కోసం అంజలి(రుహానీ శర్మ) అనే అమ్మాయిని పెళ్లిచూపులు చూడడానికి అంగీకరిస్తాడు. అంజలి తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో ఎవరి మీద ఆధారపడకుండా స్వశక్తితో ఎదుగుతుంది. ఇంట్లో వాళ్లను కూడా తనే సపోర్ట్ చేస్తుంది. తన తల్లికి ఉన్న ఆరోగ్య సమస్య కారణంగా అంజలి కూడా అర్జున్ ని కలవడానికి ఒప్పుకుంటుంది. ఇలా పెళ్లంటే ఇష్టంలేని వీరిద్దరూ ఒకరినొకరు కలిసిన తరువాత ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి..? ఒకరోజులో జరిగే కథతో దర్శకుడు రాహుల్ ఈ సినిమాను ఎలా తెరకెక్కించాడో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే!

విశ్లేషణ: 
నటుడిగా సినిమాలు చేసిన రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారడం, అది కూడా ఈ కథనే ఎందుకు ఎన్నుకున్నాడో తెలియాలంటే ప్రతిఒక్కరూ ఈ సినిమా తప్పక చూసి తీరాల్సిందే. స్టార్ కాస్ట్, ఫారెన్ లొకేషన్స్, భారీ యాక్షన్ సీన్స్ అంటూ రెగ్యులర్ ఫార్మాట్ జోలికి పోకుండా తను నమ్ముకున్న కథను ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా తీయడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు రాహుల్. పెళ్లంటే ఇష్టంలేని ఓ యువకుడిజీవితంలో పెళ్లిచూపులు కారణంగా ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయనేదే ఈ కథ. సాయంత్రం 7 గంటలకు అమ్మాయితో పెళ్లిచూపులు మొదలైతే ఉదయం 8 గంటల్లోపు ఇద్దరూ ఏకంగా పెళ్లిచేసుకోవడమనే కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది. ఇంత కొద్దిసమయంలో వీరి జీవితంలో చోటుచేసుకున్న ఊహించని సంఘటనల కారణంగా ఇద్దరూ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారనే విషయాలను తెరపై చక్కగా ఆవిష్కరించారు.

ఫస్ట్ హాఫ్ కాస్త బోరింగ్ గా అనిపించినా.. సెకండ్ హాఫ్ ఆసక్తికరంగా సాగుతుంది. దర్శకుడిగా రాహుల్ మొదటి సినిమా అయినా.. తన టేకింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రాసల జోలికి వెళ్లకుండా సహజ సంభాషణలతో అతడు రాసుకున్న డైలాగ్స్ మెప్పిస్తాయి. ప్రస్తుతం యూత్ కి కనెక్ట్ అయ్యే పాయింట్ తీసుకొని సగం మార్కులు కొట్టేసిన రాహుల్ సినిమాను మరింత ఎంటర్టైనింగ్ గా రూపొందించి నూటికి నూరు శాతం సక్సెస్ సాధించాడు. సుశాంత్ లో మంచి నటుడు ఉన్నాడని ఈ సినిమా నిరూపిస్తుంది. తన పాత్రలో ఒదిగిపోయాడు. సుశాంత్ పాత్రకు చాలా మంది అబ్బాయిలు ఈజీగా కనెక్ట్ అయిపోతారు.

ఇక హీరోయిన్ గా రుహానీ శర్మ సినిమాకు మరో ప్లస్. ఆమె సింపుల్ గా చెప్పే డైలాగ్స్, మాట తీరు, ప్రవర్తన ప్రతీదీ చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది. తెరపై వీరిద్దరి జంట బాగుంది. హీరో తల్లి పాత్రలో అను హాసన్ మెప్పిస్తుంది. హీరోయిన్ తల్లి పాత్రలో రోహిణి అద్భుత నటన కనబరిచింది. ఎమోషనల్, సెంటిమెంట్ సీన్స్ లో ఆమెను కొట్టేవారే లేరు. అంతగా ఆడియన్స్ ను మెప్పిస్తుంది. వెన్నెలకిషోర్ తెరపై కనిపించేది కొంత సమయమే  ఉన్నంతసేపు నవ్వించాడు. సాంకేతికంగా ఉన్నత విలువలతో సినిమానునిర్మించారు. సందర్భానికి తగ్గట్లుగా వచ్చే పాటలు, నేపధ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ. సినిమాటోగ్రఫీ వర్క్ మెప్పిస్తుంది. ఎడిటింగ్ వర్క్ బాగుంది.

కొన్ని చోట్ల సాగదీసినట్లు అనిపించినా.. ఓవరాల్ గా మాత్రం బాగానే అనిపిస్తుంది. రెగ్యులర్ సినిమాల మాదిరి కాకుండా కరెంట్ టాపిక్ తీసుకొని దాన్ని ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా రూపొందించారు. సినిమా చూసిన తరువాత ప్రేక్షకులకు మంచి ఫీల్ కలగడం ఖాయం. మాస్ ఆడియన్స్ ను మెప్పించే అంశాలు లేనప్పటికీ మల్టీప్లెక్స్, ఓవర్సీస్ ఆడియన్స్ కు ఈ సినిమా కనెక్ట్ అయిపోతుంది.    

రేటింగ్: 3/5