కోలీవుడ్ నటుడు కరుణాస్ బ్యాగ్ లో బుల్లెట్స్ గుర్తించిన ఎయిర్పోర్ట్ అధికారులు షాక్ కి గురయ్యారు. దాంతో ఆయనను ఫ్లైట్ ఎక్కకుండా అడ్డుకున్నారు. చెన్నై ఎయిర్పోర్ట్ లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.
ఆదివారం నటుడు కరుణాస్ చెన్నై నుండి తిరుచ్చి వెళ్లేందుకు ఎయిర్పోర్ట్ కి వెళ్లారు. రెగ్యులర్ చెకప్ లో భాగంగా చెన్నై ఎయిర్పోర్ట్ అధికారులు ఆయన లగేజీని తనిఖీ చేశారు. కరుణాస్ బ్యాగ్ లో బుల్లెట్స్ ఉండటం గమనించి నివ్వెరపోయారు. ఏకంగా 40 రౌండ్స్ బుల్లెట్స్ ఆయన వద్ద ఉన్నాయి. దాంతో కరుణాస్ ని ఫ్లైట్ ఎక్కకుండా అధికారులు అడ్డుకున్నారు. పేలుడు పదార్థాలతో ఫ్లైట్ లో ప్రయాణించడానికి అనుమతి ఇవ్వమని చెప్పారు.
కరుణాస్ ని అధికారులు విచారించగా... అవి తన లైసెన్స్డ్ తుపాకీకి సంబంధించిన బుల్లెట్స్ అని వివరణ ఇచ్చాడట. ఊరికి వెళ్లే తొందరలో ఫ్లైట్ మిస్ అవుతుందని బ్యాగ్ లో ఉన్న బుల్లెట్స్ ఇంటి వద్ద పెట్టడం మర్చిపోయానని కరుణాస్ చెప్పినట్లు తెలుస్తుంది. కరుణాస్ లైసెన్స్డ్ తుపాకీకి సంబంధించిన పత్రాలు చూపిన నేపథ్యంలో ఆయనను ఇంటికి పంపేశారట అధికారులు.
దర్యాప్తు మాత్రం కొనసాగుతుందట. కరుణాస్ ఫోక్ సింగర్ గా కెరీర్ మొదలుపెట్టాడు. అలాగే టెలివిజన్ షోలు చేశాడు. దర్శకుడు బాలా కరుణాస్ ని సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. 2001లో విడుదలైన నంద చిత్రంలో కరుణాస్ ఓ పాత్ర చేశాడు. కమెడియన్ గా అనేక చిత్రాల్లో నటించాడు. కరుణాస్ ప్లే బ్యాక్ సింగర్ కూడాను. రాజకీయ ప్రవేశం చేసి 2016లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడు.
