బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ఈవెంట్ కి వస్తానని చెప్పి రెమ్యునరేషన్ గా కొంత డబ్బుని తీసుకున్న సోనాక్షి ఈవెంట్ కి హాజరు కాలేదు. దీంతో సదరు కార్యక్రమ నిర్వాహకులు సోనాక్తి సిన్హాపై కేసు పెట్టారు.

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో గతేడాది సెప్టెంబర్ లో జరిగిన ఈవెంట్ లో పాల్గొంటానని సోనాక్షి నిర్వాహకులకు మాటిచ్చింది. ఆమె అంగీకరించడంతో కార్యక్రమానికి తగ్గట్లు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈవెంట్ రోజున మాత్రం సోనాక్షి హ్యాండ్ ఇచ్చేసింది. దీంతో షో నిర్వాహకులపై ఆడియన్స్ విరుచుపడ్డారు.

ఫలితంగా కొంత ఫర్నీచర్ ధ్వంసమయింది. దీంతో నిర్వాహకులు ఆర్థికంగా నష్టపోయారు. అంతేకాదు.. తమ పరువు కూడా పోయిందని నిర్వాహకులు సోనాక్షిపై కేసు పెట్టారు. ఈవెంట్ కి హాజరవ్వడం కోసం రూ.37 లక్షలు రెమ్యునరేషన్ అడగడంతో నిర్వాహకులు రూ.28 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చారట.

కానీ ఆఖరి నిమిషంలో ఆమె ఈవెంట్ కి డుమ్మా కొట్టేసింది. ఆమెను ఎంతగా బతిమిలాడినా ఈవెంట్ కి రాలేదని, దాంతో తమకు భారీ నష్టాలు వచ్చినట్లు నిర్వాహకులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సోనాక్షిపై చీటింగ్ కేసు నమోదు చేశారు.