హిందీ `ఛత్రపతి` రిలీజ్ డేట్.. బెల్లంకొండ హీరోకి అక్కడైనా సక్సెస్ దక్కేనా?
బెల్లంకొండ హీరో ఇప్పుడు రీమేక్‌తో రాబోతున్నారు. ఆయన `ఛత్రపతి` హిందీ రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర టైటిల్‌ని, రిలీజ్ డేట్‌ని ప్రకటించింది యూనిట్.

ప్రభాస్ హీరోగా రూపొందిన `ఛత్రపతి` సినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వైజాగ్ కోస్టల్ ఏరియాలోని పేదలపై ఓ మాఫియా లీడర్ అరాచకాలకు పాల్పడుతుండగా, దాన్ని స్థానిక యువకుడు ఎదురించి పోరాడి డాన్ గా, ఛత్రపతిగా ఎదిగిన కథాంశంతో రూపొందింది. ఇందులో ప్రభాస్‌కి జోడీగా శ్రియా నటించింది. ఈ సినిమా 2005లో విడుదలై భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రభాస్‌కి బిగ్ బ్రేక్‌నిచ్చింది.
అయితే దీన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు దర్శకుడు వి వి వినాయక్. ఇందులో నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా రెండేళ్ల క్రితం ప్రారంభమైంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ లేదు. ఈ సినిమా ఉందా లేదా? అనే డౌట్లు కూడా వస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా తాజాగా సినిమా టైటిల్‌తోపాటు రిలీజ్ డేట్‌ని ఖరారు చేశారు. ఈ సినిమాకి `ఛత్రపతి` అనే టైటిల్‌నే ఖరారు చేస్తూ టైటిల్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.
సినిమాని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మే 12న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ షర్ట్ లేకుండా కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్నారు. మెడలో బిల్లా, చేతిలో రాగి చెంబుతో ఆవేశంతో కనిపిస్తున్నారు. ఆయన బ్యాక్ నుంచి ఉన్న లుక్ ని రిలీజ్ చేయగా, వాటర్ లో నుంచి హీరో లేచినట్టుగా ఈ టైటిల్ ఫస్ట్ లుక్ ఉండటం విశేషం. ఆద్యంతం విరోచితంగా ఈ టైటిల్ ఫస్ట్ లుక్ కనిపిస్తుంది. ఇక ఈ సినిమాని పెన్ మూవీస్ పతాకంపై జయంతిలాల్ గడా నిర్మిస్తున్నారు. నుష్రత్ హీరోయిన్‌గా నటిస్తుంది.
ఇక చాలా కాలంగా హీరో బెల్లంకొండకి తెలుగులో విజయాలు లేవు. `రాక్షసుడు` సినిమా ఫర్వాలేదనిపించింది. ఆ తర్వాత నటించిన `అల్లుడు అదుర్స్` పరాజయం చెందింది. అంతకు ముందు `జయజానకీ నాయక`, `సాక్ష్యం`, `కవచం`, `సీత` వంటి చిత్రాలు సైతం పరాజయం చెందాయి. దీంతో బెల్లంకొండ తెలుగులో హీరోగా ఇంకా సెటిల్ కాలేదు. నిలదొక్కుకోలేదు. ఇప్పుడు హిందీలో రాణించేందుకు సిద్ధమవడం విశేషం.
అయితే ఆయన తెలుగులో నటించిన యాక్షన్ చిత్రాలకు హిందీలో డబ్బింగ్ వెర్షన్‌లో యూట్యూబ్‌లో మంచి స్పందన లభించింది. కొంత మార్కెట్ కూడా ఏర్పడింది. ఈ ధైర్యంతో `ఛత్రపతి`ని హిందీలో రీమేక్ చేశారు. ఇప్పుడు రీమేక్‌లు వర్కౌట్ కావడం లేదు. మరి `ఛత్రపతి` హిందీలో ఆదరణ పొందుతుందా అనేది చూడాలి. మరోవైపు వినాయక్ కూడా `ఖైదీ నెంబర్ 150` తర్వాత సక్సెస్ లేదు. దీంతో ఆయనకు కూడా హిట్ కావాలి. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్, వినాయక్ ఈ సినిమాపైనే ఆధార పడ్డారని చెప్పొచ్చు. దీంతోపాటు ప్రస బెల్లంకొండ స్థాయి శ్రీనివాస్ `స్టూవర్ట్ పురం దొంగ` చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇది చిత్రీకరణ దశలో ఉంది.