టాలీవుడ్ లో ఒకప్పుడు తన అందంతో కుర్రకారును తెగ ఆకట్టుకున్న బ్యూటీ ఛార్మి కౌర్. తెలుగు జనాలకు వివిధ సినిమాలతో బాగా దగ్గరైన ఈ భామ శుక్రవారం 32వ బర్త్ డేను జరుపుకోనుంది. ప్రస్తుతం ప్రొడ్యూసర్ గా పూరి ప్రొడక్షన్ హౌస్ లో వర్క్ చేస్తోన్న అమ్మడు రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేసింది. 

ఇన్ని రోజులు యాక్టింగ్ పై ఎలాంటి వివరణ ఇవ్వని అమ్మడు ఇక తెరపై కనిపించడం అనివార్యమని క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ప్రొడ్యూసింగ్ పనుల్లో బిజీగా ఉన్నానని పూరి కనెక్ట్స్ లో సినిమాకు సంబందించిన ప్రతి విషయంలో చర్చలు జరపడం అలాగే ప్రమోషన్స్ - నటీనటుల ఎంపిక వంటి విషయాలు తన బాధ్యత అని వివరణ ఇచ్చారు. 

ప్రస్తుతం ఛార్మికి అవకాశాలు వస్తున్నప్పటికీ వాటిని సున్నితంగా తిరస్కరిస్తోందట. యాక్టింగ్ కెరీర్ కు ఎండ్ చెప్పేసి నిర్మాతగా కొనసాగాలనేదే ఇప్పుడు తన గోల్ అని చెబుతూ.. ఇక నటన గురించి ఏ మాత్రం ఆలోచించనని చెప్పిన ఛార్మి ఓ విధంగా మంచి నిర్ణయమే తీసుకుందని చెప్పవచ్చు. అవకాశాలు రాకపోయినా కూడా అమ్మడు నిరాశ చెందకుండా ఇష్టమైన ఇండస్ట్రీలో కొనసాగేందుకు నిర్మాతగా ఒక పనిని ఎంచుకుంది. ఈ బాటలో అమ్మడికి మంచి సక్సెస్ లు రావాలని కోరుకుందాం.