బిగ్ బాస్ సీజన్ 4 పాల్గొన్న గంగవ్వ క్రేజ్ ఏమిటో ఆమె బయటికి వచ్చాక అర్థం అవుతుంది. ఇంటిలో ఉన్నన్ని రోజులు గంగవ్వ బెర్త్ కి ఢోకా లేదు. ఒక సామాన్యురాలుగా 60ఏళ్ల వయసులో బిగ్ బాస్ లాంటి క్రేజీ షోకి ఎంపిక కావడమే పెద్ద విషయం. అందుకే గంగవ్వ ఓట్ల విషయంలో కుమ్మేసింది. అలాగే ప్రేక్షకుల నమ్మకం ఒమ్ముకాకుండా ఇంటిలో దాదాపు అన్ని రకాల ఛాలెంజ్ లు ఎదుర్కోవడానికి ప్రయత్నం చేసింది. శారీరక బలం అవసరమైన కొన్ని ప్రమాదకర టాస్క్ లనుండి బిగ్ బాస్ ఆమెకు మినహాయింపు పరోక్షంగా ఇచ్చారు. 

హౌస్ లో గంగవ్వ జోరు చూసిన చాలా మంది ఆమె విన్నర్ కావడం ఖాయం అనుకున్నారు. అనూహ్యంగా ఇంటిపై బెంగతో అనారోగ్యం పాలైన గంగవ్వ తనను బయటికి పంపించేయాలని బిగ్ బాస్ ని కోరింది. దీనితో ఆమె ఎలిమినేట్ కాకుండానే హౌస్ నుండి బిగ్ బాస్ ఇంటికి పంపించేశారు. ఇక బయటికి వచ్చిన గంగవ్వ ఫాలోయింగ్ మాములుగా లేదు. ముక్కు మొహం తెలియని యూట్యూబ్ ఛానల్స్ నుండి ప్రముఖ టీవీ చానెల్స్ వరకూ ఆమె ఇంటర్వ్యూ కోసం ఎగబడుతున్నారు. మైకులు, కెమెరాలు పట్టుకొని గంగవ్వ సొంతూరికి పయనమవుతున్నారు. 

ఆమె ఇంటర్వ్యూలకు యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ వస్తుండగా, టీవీ ఛానెల్స్ కి మంచి టీఆర్పీ దక్కుతుంది. దీనితో వరుసగా అందరూ గంగవ్వను కెమెరాలో బంధించి వేస్తున్నారు. గంగవ్వ మాటలకే కాకుండా ఆమె ఇల్లు, పరిసరాలు, పొలం పుట్రా అన్నీ ప్రేక్షకులకు చూపించేస్తున్నారు. గంగవ్వ గురించి పూర్తిగా తెలుసుకోవాలన్న ప్రేక్షకుల ఆత్రుత కారణంగా ఆ కార్యక్రమాలకు మంచి ఆదరణ దక్కుతుంది. దీనితో స్వలాభం కోసం గంగవ్వ క్రేజ్ ని వాడేసుకుంటున్నారు. 

ఇక గంగవ్వ క్రేజ్ మరియు ఫాలోయింగ్ చూస్తుంటే ఈమె త్వరలో అనేక టీవీ కార్యక్రమాలలో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అలాగే గంగవ్వ వెండితెరపై అనేక పాత్రలలో కనిపించే అవకాశం కూడా లేకపోలేదు. ఓ మారుమూల పల్లెలో, కనీస చదువు కూడా లేని గంగవ్వ ఈ రేంజ్ కి ఎదగడం చాలా మందికి స్ఫూర్తిని ఇచ్చే అంశమే.