దర్శకుడనే పదానికి స్టార్‌ ఇమేజ్‌ని తీసుకొచ్చిన డైరెక్టర్‌ దాసరి. దర్శకుడంటే కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ అనే పదానికి సరైనా అర్థం చెప్పిన దర్శకుడు దాసరి. దర్శకుడికి గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చిన డైరెక్టర్‌ దాసరి. అందుకే ఆయన్ని దర్శకరత్న అని పిలుస్తుంది తెలుగు చిత్ర పరిశ్రమ. టాలీవుడ్‌ మాత్రమే కాదు, యావత్‌ చిత్ర లోకం ఆయన్ని అలానే పిలుస్తుంది. పిలవాలి కూడా. దాదాపు అన్ని రకాల జోనర్లలో సినిమాలు తీసి తన సినిమాలే ఓ వీకిపీడియాగా చేశారు దర్శక రత్న దాసరి నారాయణరావు. ఆయన మనల్ని, సినిమాని వదిలి వెళ్లిపోయి నాలుగేళ్లు అవుతుంది. ఆయన లేకపోయినా తన సినిమాలతో దాసరి బతికే ఉన్నారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుని ఉన్నారు. 

నేడు(మే 4)న దాసరి నారాయణరావు జయంతి. ఈ సందర్భంగా చిరంజీవి ఆయన్ని గుర్తు చేసుకున్నారు. విషెస్‌ తెలిపారు. అంతేకాదు ఆయనకు సరైన గుర్తింపు దక్కలేదని, పద్మ పురస్కారంతో ఆయన్ని గౌరవించాలని చిరంజీవి డిమాండ్‌ చేశారు. `దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జన్మదిన సందర్భంగా ఆయనకు నా స్మృత్యంజలి. విజయాలలో ఒక దానికి మించిన మరో చిత్రాలని తన అపూర్వ దర్శకత్వ ప్రతిభతో మలచడమే కాదు, నిరంతరం చిత్ర పరిశ్రమలోని సమస్యలని పరిష్కారానికి ఆయన చేసిన కృషి, ఎప్పటికీ మార్గదర్శకమే. దాసరికి ఇప్పటికీ తగిన ప్రభుత్వ గుర్తింపు రాకపోవడం ఒక తీరని లోటు. ఆయనకు పోస్త్యుమస్‌(చనిపోయిన తర్వాత ఇచ్చే గౌరవం)గా నైనా విశిష్టమైన పద్మ పురస్కారం దక్కితే అది మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమకి దక్కే గౌరవమవుతుంది` అని ట్వీట్‌ చేశారు. దీనికి సినీ వర్గాల నుంచి, అభిమానుల నుంచి మద్దతు పెరుగుతుంది. 

మరోవైపు దాసరి జయంతి సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్‌లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు `మా` అధ్యక్షుడు వి.కె.నరేష్‌. ఈ కార్యక్రమంలో నిర్మాతలు సి.కళ్యాణ్‌, టి. రామసత్యనారాయణ, కొరియోగ్రాఫర్‌ సత్య మాస్టర్‌ తదితరులు పాల్గొన్నారు.