అశ్లీల కంటెంట్‌ని ప్రసారం చేసే ఓటీటీ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వాటిని బ్లాక్‌ చేసేందుకు సిద్ధమైంది. అదే సమయంలో హెచ్చరికలు జారీ చేసింది.  

అశ్లీల కంటెంట్‌ని వ్యాప్తి చేసే ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌లపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దాదాపు 18ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను బ్లాక్‌ చేసేందుకు సిద్ధమయ్యింది. డిజిటల్‌ ప్లాట్ ఫామ్‌లలో పెరుగుతున్న అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్‌ని అరికట్టాలనే ఉద్దేశ్యంతో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గురువారం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అభ్యంతరకరమైన కంటెంట్‌ని ప్రసారం చేస్తున్న 18 ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లపై చర్యలకు దిగింది. 

వీటితోపాటు వీటికి లింక్‌ అయి ఉన్న 19 వెబ్‌ సైట్లు, పది యాప్‌లు, అలాగే 57 సోషల్‌ మీడియా అకౌంట్లపై కేంద్ర నిబంధనలు పెట్టింది. పబ్లిక్‌లో ఇవి కనిపించకుండా యాక్సెస్‌ని రిస్టిక్ట్ చేసింది. ఓపెన్‌గా ఇవి కనిపించకుండా చేసింది కేంద్రం. దీనిపై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ స్పందిస్తూ, నైతిక ప్రమాణాలను పాటించడం, అశ్లీలంగా, అసభ్యంగా భావించే కంటెంట్‌ని ప్రచారం చేయడం, ప్రసారం చేయడం మానుకోవాల్సిన ఆవశ్యకత ఉందని వెల్లడించారు. 

అభ్యంతరకరమైన కంటెంట్‌ని వ్యాప్తి చేయడం కోసం గుర్తించిన 18 ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లను మూసివేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి వెల్లడించారు. ఇలాంటి కంటెంట్‌ని ఎవరూ వ్యాప్తి చేయవద్దని, వాటికి దూరంగా ఉండాలని మంత్రి తెలియజేశారు. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇది భారత ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య అనుసంధానం, మీడియా, వినోదం, మహిళల హక్కులు, పిల్లల హక్కులకు సంబంధించి పనిచేస్తుంది. 

కేంద్ర ప్రభుత్వం బ్లాక్‌ చేసిన ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో Dreams Films, Voovi, Yessma, Uncut Adda, Tri Flicks, X Prime, Neon X VIP, Besharams, Hunters, Rabbit, Xtramood, Nuefliks, MoodX, Mojflix, Hot Shots VIP, Fugi, Chikooflix and Prime Play వంటి ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్ ఉన్నాయి.