గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పురస్కారంతో సత్కరించనుంది. తాజాగా ఆయనకు ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది. మన దేశంలో అత్యున్నత పురస్కారంగా భావించే పద్మ అవార్డులను సోమవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో కళా రంగం నుంచి ఎస్పీ బాలసుబ్రమణ్యంకి భారత రెండో అత్యున్నత పురస్కరం ప్రకటించి సరైన విధంగా గౌరవించిందని చెప్పొచ్చు. రేపు రిపబ్లిక్‌ డే సందర్భంగా కేంద్ర ఈ అవార్డులను ప్రకటించింది.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4న నెల్లూరులోని కోనేటమ్మపేటలో జన్మించారు. ఆయన అసలు పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం. చిన్నతనం నుంచే పాటలు పాడటం హాబీగా మార్చుకున్న బాలుకి.. తొలిసారిగా 1966లో విడుదలైన `శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న` చిత్రంలో పాడే అవకాశం వచ్చింది. ఐదున్నర దశాబ్దాల సినీ కెరీర్‌లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంతోపాటు ఉత్తరాధి భాషలు ఇలా ఇండియాకి చెందిన 11 భాషల్లో నలభై వేలకుపైగా పాటలు ఆలపించి శ్రోతల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. పాట అంటే బాలు.. బాలు అంటే పాటే అనేలా ఆయన పాటల ఆడియెన్స్ మంత్రముగ్థుల్ని చేశాయి. ఐదున్నర దశాబ్దాలు ఆయనపాటలో మునిగి తేలేలా చేశాయి. 

ఎస్పీ బాలు గతేడాది సెప్టెంబర్‌ 25న కరోనాతో పోరాడి తుది శ్వాస విడిచిన విషయంతెలిసిందే. దాదాపు ఇరవై రోజులకుపైగా ఆయన కరోనాతో పోరాడారు. కరోనా నుంచి కోలుకున్నా, ఊపితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ కారణంగా చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.