‘నాటు నాటు’కు ఆస్కార్.. భారతీయులు గర్వించే క్షణం.. మెగాస్టార్, పవన్, మహేశ్, బాలయ్య, నాగ్, రవితేజ ప్రశంసలు
సెన్సేషనల్ ‘నాటు నాటు’ సాంగ్ కు ఆస్కార్ దక్కడం పట్ల సినీ తారల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. భారతీయులకు పండగ తెచ్చిన ఈ క్షణాన్ని ఆస్వాదిస్తూ గర్విస్తున్నారు. ఈ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ను అభినందిస్తున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ భారతీయులను గర్వించేలా చేసింది. ప్రపంచ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసింది. 95వ ఆస్కార్ వేడుకలు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో గల డాల్బీ థియేటర్ లో నేడు అట్టహాసంగా జరిగింది. ఈ వేదికపై సెన్సేషనల్ సాంగ్ Naatu Naatuకు ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (MM Keeravani), లిరిసిస్ట్ చంద్రబోస్ (Chandra Bose) అవార్డును స్వీకరించారు. వేదికపై తమ స్పీచ్ తో అదరగొట్టారు. ‘ఆర్ఆర్ఆర్’కు ఆస్కార్ వరించడం పట్ల సినీ తారలు ఉప్పొంగిపోతున్నారు. ఈ సందర్భంగా ట్వీటర్ వేదికన ప్రశంసల వర్షం కురపిస్తున్నారు.
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు ‘నాటు నాటు’ సాంగ్ కు వరించడం పట్ల మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చాలా సంతోషించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ ద్వారా ఇండియాకు ఆస్కార్ అవార్డు రావడం చాలా సంతోషం. ఊహించని విజయం సాధించి భారతీయులను గర్వించేలా చేశారు. ఒక వ్యక్తి విజన్, ధైర్యం, పట్టుదలతోనే ఇది సాధ్యమైంది. గొప్ప విజయాన్ని భారత్ కు అందించినందుకు గర్వపడుతున్నాను. ఈ సందర్భంగా హ్రుదయపూర్వకంగా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ను అభినందిస్తునన్నారు. ఎస్ఎస్ రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎంఎం కీరవాణి, కాలభైరవ, రాహుల్, యూనిట్ మెత్తానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
భారతీయులు గర్విస్తున్న క్షణాలివి... అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నాటు నాటు ఆస్కార్స్ పై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారతీయులందరూ గర్వపడేలా ఆస్కార్ వేదికపై పురస్కారాన్ని స్వీకరించిన ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఎం.ఎం.కీరవాణి, గీత రచయిత శ్రీ చంద్రబోస్ కు హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు. ఈ వార్తను చూడగానే ఎంతో సంతోషించాను. ‘నాటు నాటు’ గీతంలోని తెలుగు పదం నలుచెరగులా ప్రతి ఒక్కరితో పదం కలిపేలా చేసి హుషారెత్తించింది. ఆస్కార్ వేదికపై ఈ గీతాన్ని ప్రదర్శించడం సంతోషకరం.. ఈ సందర్భంగా ఎస్ఎస్ రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, గాయకులు శ్రీ రాహుల్ సిప్లిగంజ్, శ్రీ కాలభైరవ, నృత్య దర్శకులు శ్రీ ప్రేమ్ రక్షిత్, చిత్ర నిర్మాత శ్రీ డి.వి.వి.దానయ్యలకు అభినందనలు తెలిపారు.
నందమూరి బాలకృష్ణ : ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుని గెలుపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర బృందానికి నా హృదయపూర్వక అభినందనలు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఉత్తమ పాటగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవడం భారతీయ సినీ చరిత్రలో అపూర్వ ఘట్టం. తెలుగు జాతితో పాటు దేశం గర్వించదగిన విజయమిది. స్వరకర్త కీరవాణి గారికి, గీత రచయిత చంద్రబోస్ గారికి, ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు. అలాగే డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్న భారతీయ చిత్రం ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ చిత్ర బృందానికి నా అభినందనలు’’ అని తెలిపారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh babu) స్పందిస్తూ.. నాటు నాటు ఆస్కార్స్ ను అందుకుని అన్ని హద్దులను చెరిపేసింది. అసాధారణమైన విజయాన్ని సాధించిన ఎంఎం కీరవాణి, చంద్రబోస్ మరియు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇండియన్ సినిమాకు ఇది గర్వించే క్షణం’ అంటూ ట్వీట్ చేశారు.
ఈ విజయంపై రియల్ హీరో సోనూసూద్ (SonuSood) స్పందించారు. ఇండియాకు రెండు అవార్డులు సొంతం కావడం పట్ల అభినందనలు తెలియజేశారు. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కు, ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ టీమ్, కీరవాణి, రామ్ చరణ్, తారక్ కు శుభాకాంక్షలు తెలిపారు.
రెబల్ స్టార్, దివంగత కృష్ణంరాజు సతీమణి శ్యామాలా దేవి ‘నాటు నాటుకు’ ఆస్కార్ దక్కడం పట్ల సంతోషించారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీమ్ ను అభినందిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఆస్కార్స్ విషయంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి చిరకాల స్వప్నం నెరవేరింది. 'నాటు నాటు' ఆస్కార్ అందుకోవడం తెలుగు వారందరికీ గర్వకారణం. ఆస్కార్ వేదికపై కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఈ అవార్డును అందుకోవడం చూస్తుంటే నాకు కృష్ణంరాజు గారు చెప్పిన మాటలే గుర్తు వచ్చాయి. ఆయన ఎప్పుడూ తెలుగు సినిమాకి ఆస్కార్ రావాలని చాలా బలంగా కోరుకుంటూ ఉండేవారు.. ఆర్ఆర్ఆర్ చూసిన తర్వాత ఈ సినిమాకి అనేక అవార్డులు వస్తాయని ఆయన ముందే ఊహించారు. అలాంటి కృష్ణంరాజు గారి బలమైన కోరికను రాజమౌళి అండ్ టీం నెరవేర్చింది. అంటూ భావోద్వేగమయ్యారు. ఈ సందర్భంగా టీమ్ అందరికీ కంగ్రాట్స్ తెలియజేశారు.
కింగ్, అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ట్వీటర్ వేదికన స్పందించారు. Naatu Naatu భారతీయ సినిమాకు ఆస్కార్ చారిత్రాత్మక క్షణం.. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ మనల్ని గర్వించేలా చేసింది. ఇందుకు రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్, ఎంఎం కీరవాణి, చంద్రబోస్, సింగర్స్ కాలబైరవ, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్ రక్షిత్, నిర్మాత దానయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.
హిస్టరీ క్రియేట్ చేశారంటూ.. మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) సైతం సంతోషం వ్యక్తం చేశారు. కీరవాణి, చంద్రబోస్, గాయకులు శుభాకాంక్షలు తెలిపారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి విజన్, మాస్టర్ మైండ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ అదిరిపోయే డాన్స్ ఆస్కార్ ను సాధించిందని అభిప్రాయపడ్డారు. ప్రపంచాన్ని జయించండి అంటూ టీమ్ ను అభినందించారు. అలాగే రామ్ పోతినేని (Ram Pothineni) సైతం ప్రశంసలు కురిపించారు. టీమ్ వర్క్, గ్రేట్ విజనరీకి ‘ఆర్ఆర్ఆర్’ ఉదాహరణగా నిలిచిందన్నారు. స్ఫూర్తిదాయకమన్నారు.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ‘నాటు నాటు’కు ఆస్కార్ దక్కడం పట్ల ఉప్పొంగిపోయారు. ‘మాటలు రావడం లేదు.. ప్రపంచం మొత్తం నాటుమయం అయ్యింది. రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్, ఎన్టీఆర్, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ, ప్రేమ్ రక్షిత్ కు హ్రుదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ నిర్మించి ప్రతిస్టాత్మక అవార్డు సాధించినందుకు గర్వంగా ఉందన్నారు. స్టార్ నటుడు శరత్ కుమార్ (Sarath Kumar) కూడా సంతోషించారు. ఆస్కార్ అందుకున్న కీరవాణి, చంద్రబోస్ కు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ను అభినందించారు.