అడల్డ్ కంటెంట్‌తో వస్తోన్న `డర్టీ హరి` చిత్ర నిర్మాత గూడూరు శివరామకృష్ణపై కేసు నమోదైంది. వెంకటగిరి ప్రాంతంలోని మెట్రో పిల్లర్‌పై అతికించిన సినీ పోస్టర్లపై కేసు నమోదు చేసినట్టు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. ఈ చిత్ర పోస్టర్లు స్త్రీల గౌరవాన్ని అవమానించేలా ఉన్నాయని, యువతని తప్పుదోవ పట్టించేలా ఉందని, చిత్ర నిర్మాత గూడూరు శివరామకృష్ణపై, అలాగే పబ్లిషింగ్‌ ఏజెన్సీలపై సుమోటో కేసు నమోదు చేశామని జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించారు. 

ప్రముఖ దర్శక, నిర్మాత ఎంఎస్‌ రాజు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర పోస్టర్స్, టీజర్‌ చూస్తుంటే అడల్ట్ కంటెంట్‌తో ఈ సినిమా రూపొందుతుందని అర్థమవుతుంది. అయితే ఈ సినిమా ద్వారా ఎలాంటి సందేశం అందిస్తారనేది సస్పెన్స్ గా మారింది. ఇందులో శ్రావణ్‌ రెడ్డి, రుహాని శర్మ జంటగా నటించారు. హైలైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎస్‌పీజే క్రియేషన్స్ పతాకాలపై సినిమా రూపొందుతుంది. గూడూరు శివరామకృష్ణ నిర్మాత. ఇది ఈ నెల 18న ఫ్రైడేమూవీ ఏటీటీలో విడుదల కాబోతుంది.