ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలీవుడ్ లో కూడా కొన్ని చిత్రాల్లో నటించాడు. గతంలో ఆయన 'ఉలవచారు బిరియానీ' పేరుతో ఓ సినిమా తీశాడు. ఆ సినిమా సక్సెస్ కావడంతో బాలీవుడ్‌లో ‘తడ్కా’ పేరు రీమేక్ చేసి దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు. 

మూడేళ్ల క్రితం నానాపటేకర్, తాప్సీ పన్ను, ఆలీ ఫజల్ కాంబినేషన్‌లో సినిమాను అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటివరకు సినిమా రిలీజ్ కాలేదు. మేకింగ్ సమయంలో ఏర్పడ్డ ఆర్ధిక సమస్యల కారణంగా సినిమా విడుదలకు నోచుకోలేదు.

ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ప్రకాష్ న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నాడు. నిర్మాణ సంస్థలు ఎస్సెల్ విజన్, జీ గ్రూప్ కంపెనీలు ఒప్పందం ప్రకారం ప్రకాశ్‌రాజ్ తమకు చెల్లించాల్సిన రూ.5.88కోట్లను చెల్లించలేదని కోర్టులో కేసు వేశాయి.

పరిస్థితి చేయి దాటుతుండడంతో ప్రకాష్ రాజ్ కేసు వేసిన నిర్మాణ సంస్థలకు రెండు కోట్ల రూపాయల చెక్కుతో పాటు, ఆస్తి పత్రాలను కూడా అందించారు. దీంతో కోర్టు ప్రకాష్ రాజ్ కి వచ్చే ఫిబ్రవరి వరకు సమయం ఇచ్చింది. ఈలోపు ఆయనిచ్చిన రెండు కోట్ల రూపాయల చెక్ క్లియర్ కావాలని చెప్పింది.