కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించే ప్రతీ చిత్రానికి ఏదొక వివాదం తలెత్తడం ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది. ఈ వివాదాలు కోర్టు వరకు వెళ్తున్నాయి. ప్రస్తుతం విజయ్, అట్లీ కాంబినేషన్ లో 'బిగిల్' అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాపై కూడా వివాదం మొదలైంది. ఈ సినిమా విషయంలో విజయ్ పై  మత్స్య వ్యాపారులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

కోవైకు చెందిన అన్నాడీఎంకే నాయకుడు, ఉక్కడం నూతన మార్కెట్‌లో చేపల దుకాణదారుడు కోళికడై గోపాలం అలియాస్‌ పళనిస్వామి సహా ఐదుగురు సోమవారం కోవై 
కలెక్టర్‌ కార్యాలయంలో నటుడు విజయ్‌పై ఫిర్యాదు చేశారు.

తమిళనాడులోనే కాకుండా మొత్తం భారతదేశంలోని చేపల దుకాణదారులు, మాంసం వ్యాపారుల మనోభావాలను దెబ్బతీసేలా విజయ్ ప్రవర్తించారని.. అతడికి తమిళ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని అన్నారు. మత్య్స, మాంస వ్యాపారులు తమ పనిని మొదలుపెట్టే ముందు వారు ఉపయోగించే కత్తులకు నమస్కరిస్తారు. అలాంటి కత్తులపై నటుడు విజయ్‌ కాలు పెట్టి కూర్చున్న దృశ్యంతో కూడిన బిగిల్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ పోస్టర్ మత్స్య,మాంసాల వ్యాపారుల మనోభావాలకు భంగం కలిగించే ఉందని.. ఆ సన్నివేశాలను సినిమా నుండి తీయకపోతే దేశ వ్యాప్తంగా మత్స్య, మాంసం వ్యాపారుల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే నటుడు విజయ్, దర్శకుడు అట్లీకి నోటీసులు పంపించారు.