సినీ నటుడు ఉదయ కిరణ్ నండూరిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. అమీర్ పేట్ కి చెందిన శివ 
ప్రసాద్ అనే వ్యాపారికి జూబ్లీహిల్స్ రోడ్ నెం.59లోని నందగిరి హిల్స్ ఆదిత్య హిల్స్ లో ఫ్లాట్ ఉంది.

దీన్ని అద్దెకు తీసుకోవడానికి సినీ నటుడు ఉదయ్ కిరణ్ తప్పుడు గుర్తింపు పత్రాలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ఉదయ్ కిరణ్ కి సంబంధించిన వివరాలను శివ ప్రసాద్ ఇంటర్నెట్ లో సెర్చ్ చేయగా.. డ్రగ్స్, కారు దొంగతనం కేసుల్లో అతడు జైలుకి వెళ్లి వచ్చినట్లు గుర్తించాడు.

దీంతో అతడు ఉదయ్ కిరణ్ కి ఫోన్ చేసి ఫ్లాట్ అద్దెకి ఇవ్వడం లేదని చెప్పాడట. అయితే అప్పటికే లగేజీతో సహా ఫ్లాట్ కి వచ్చిన ఉదయ్ కిరణ్ వాచ్ మెన్ దగ్గర తాళాలు తీసుకొని లోపలకి వెళ్లే ప్రయత్నం చేశాడు.

అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారని వాచ్ మెన్, ఇంటి యజమాని పైకి 20 మంది రౌడీలని పంపించాడట. ఇళ్లు ఖాళీ చేయనని హెచ్చరించాడట. దీంతో ఉదయ్ కిరణ్ పై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.