బాలీవుడ్ హిరోయిన్ శ్రద్ధా కపూర్ పై క్రిమినల్ కేసు

First Published 27, Dec 2017, 5:55 PM IST
case filed against bollywood heroine shraddha kapoor
Highlights
  • సాహో చిత్రంలో ప్రభాస్ సరసన నటిస్తున్న శ్రద్ధా కపూర్
  • శ్రద్ధా కపూర్ పై క్రిమినల్ కేసు
  • హసీనా పార్కర్ సినిమా నిర్మాత సహా శ్రద్ధపై కేసు

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్, ప్రభాస్‌ సాహో హిరోయిన్ శ్రద్ధా కపూర్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ప్రముఖ దుస్తుల డిజైన్ కంపెనీ ఆమెతో పాటు నిర్మాత నహీద్ ఖాన్ మీద ఈ కేసు వేశారు. వాస్తవానికి ఈ కేసులో శ్రద్ధా కపూర్‌ ఉద్దేశ్య పూర్వకంగా చేసింది ఏమీ లేదు, 'హసీనా పార్కర్' సినిమాలో ముఖ్య పాత్ర పోషించడంతో ఆమె కూడా ఈ కేసులో ఇరుక్కోక తప్పలేదు.

 

ఈ ఏడాది శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో బాలీవుడ్లో ‘హసీనా పార్కర్' అనే సినిమా వచ్చింది. ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ ధరించిన దుస్తువులను డిజైన్ చేయడానికి ఓ ప్రముఖ డిజైనర్ సంస్థ ‘ఎం అండ్ ఎం' ఒప్పందం చేసుకుంది. అయితే దర్శక నిర్మాతలు కాంట్రాక్టును ఉల్లంఘించడంతో వారు కోర్టుకెక్కారు.

 

వివరాళ్లోకి వెళ్తే.. కాంట్రాక్ట్‌ ప్రకారం సినిమాలో ‘ఎం అండ్ ఎం' పేరు వేయాలి. సినిమాలో తమ కంపెనీ పేరు ఎక్కడా కనిపించక పోవడంతో సదరు సంస్థ నిర్మాత నహిద్‌ ఖాన్‌, శ్రద్ధా కపూర్‌పై అంధేరీ మెట్రోపాలిటన్‌ కోర్టులో పిటిషన్‌ వేసింది. ఈ కేసును విచారణకు స్వీకరించిన కోర్టు దీనిపై ఎంక్వయిరీ చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. ‘హసీనా పార్కర్‌' ఈ ఏడాది సెప్టెంబర్‌ 22న విడుదలైంది. ఈ చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహించారు. నహిద్ ఖాన్ నిర్మాత. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.

 

ప్రస్తుతం శ్రద్ధా కపూర్ ‘సాహో' చిత్రంలో నటిస్తోంది. బాహుబలి స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీలో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2018లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

‘సాహో' సినిమా తర్వాత శ్రద్ధా కపూర్ ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్‌లో నటించబోతున్నారు.

loader