బాలీవుడ్ అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ చిక్కుల్లో ఇరుక్కున్నారు. 2014లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విజయవంతంగా నిర్వహించిన మంగళ్‌యాన్‌ను ఆధారంగా చేసుకుని అక్షయ్ కుమార్ హీరోగా త్వరలో తెరకెక్కుతున్న ‘‘మార్స్ మిషన్’’ సినిమా అసలు కథ తనదేనని.. దీనిని కాపీ కొట్టి సినిమా తెరకెక్కించారంటూ ప్రముఖ మహిళా దర్శకురాలు రాధా భరద్వాజ్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

తన అనుమతి లేకుండా మూలకథలోని అంశాన్ని తీసుకుని ‘‘ మిషన్ మంగళ్’’ తెరకెక్కించాలనుకుంటున్నారని... కనీసం తనకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదని.. కనుక వెంటనే సినిమా నిర్మాణాన్ని నిలిపివేయించాల్సిందిగా ఆమె న్యాయస్థానాన్ని కోరారు. 

ఈ కథను తాను విద్యా బాలన్‌కు,  నిర్మాత అతుల్ కాస్‌బేకర్‌కు గతేడాది వివరించానని పిటిషన్‌లో పేర్కొంది. అయితే వారి నుంచి స్పందన లేకపోవడంతో.. ఆ కథను ఆమె ‘‘స్పేస్ మామ్’’ అనే టైటిల్‌తో సినిమాగా తీశారు. దీని మూలకథ, స్క్రీన్‌ ప్లేను రాధ అమెరికా కాపీరైట్ చట్టం ప్రకారం 2016లో రిజిస్టర్ చేయించారు.

మంగళ్‌యాన్‌పై ఎన్నో పుస్తకాలు, కథనాలు, వ్యాసాలు వచ్చినప్పటికీ.. ఈ ప్రాజెక్ట్‌లో దాగివున్న మహిళా ఇంజనీర్ల ప్రతిభ, శ్రమను ప్రపంచానికి తెలిపేలా రాధ కథ రాసుకున్నారని ఆమెకు న్యాయ సలహాదారుగా ఉన్న సృష్టి ఓజా తెలిపారు. 

ఈ విషయం తెలుసుకున్న ఇస్రో... రాధ ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ ఆ సినిమాకు తాము కూడా సాయం చేస్తామని చెప్పి... మంగళ్‌యాన్‌ ప్రాజెక్టు‌లో పాలుపంచుకున్న మహిళా ఇంజనీర్లతో ఇంటర్వ్యూలు సైతం ఇప్పించినట్లు సృష్టి తెలిపారు. 2016లో రాధ నిర్మాత కాస్‌బేకర్‌ ప్రొడక్షన్‌లో పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. 

ఈ క్రమంలో బయటకు చెప్పరాదనే షరతు మీద తన మంగళ్‌యాన్ స్క్రిప్ట‌ును రాధ ఆయనకు ఇచ్చింది. అయితే కాస్‌బేకర్ హీరోయిన్ విద్యాబాలన్‌కు మేనేజర్‌గా సైతం వ్యవహరిస్తున్నాడు.. ఈ నేపథ్యంలో స్క్రిప్టును ఆమెకు చూపించాడు.

తన ఒప్పందాన్ని మీరి స్క్రిప్టును విద్యాబాలన్‌కు చూపించడంతో పాటు.. అతుల్ బృందం కొన్ని ఐడియాలను అక్షయ్ కుమార్ సినిమాకు వాడుకున్నట్లుగా రాధా భరద్వాజ్ వాదిస్తున్నారు. మరోవైపు ‘‘మిషన్ మంగళ్’’ చిత్రాన్ని అతి త్వరలో సెట్స్‌పైకి తీసుకెళ్లి.. 2019 స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదల చేయాలని ఆ చిత్ర యూనిట్ పట్టుదలగా ఉంది.

స్క్రిప్ట్‌కు కొన్ని మార్పులు చేర్పులు చేసేందుకు గాను.. త్వరలో ఇస్రో శాస్త్రవేత్తలతో ఈ చిత్ర యూనిట్ సమావేశం కానుంది. ఈ సినిమాకి కీ రోల్‌గా ఉన్న అంశం.. తన స్క్రిప్ట్‌కు దగ్గరగా ఉందని రాధా వాదిస్తున్నారు. 

ఈ సినిమాకు వస్తున్న హైప్.. ఇదే అంశంతో తెరకెక్కుతున్న తన ‘‘ స్పేస్ మామ్స్’’ సినిమా ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ఆమె తెలిపారు. ఒరిజినల్ కథకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని.. ఈ సంగతి అక్షయ్ కుమార్‌కు గాని, ఫాక్స్‌ స్టార్ అలాగే అమెరికాలోని కొందరికి తెలిసే అవకాశం లేకపోవచ్చని రాధ అభిప్రాయపడ్డారు.

తన సినిమా భారతీయ మహిళ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతుందని. ప్రాచీన కాలం నుంచి నేటి వరకు శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతీయ మహిళలు సాధించిన అభివృద్ధిని వివరిస్తుందన్నారు. 

ఈ సినిమాకు నిర్మాత, దర్శకురాలు, ఫైనాన్షియర్లు, నటీనటులు అంతా మహిళలే అని ఆమె స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం బాలీవుడ్‌ను ఏలుతున్న పురుష సమాజానికి వంత పాడుతున్న కొందరు మహిళల కారణంగా.. ఈ సినిమాకు నిర్మాత, దర్శకుడు, హీరోలకు మహిళలు సాయపడేవారిగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

బాలీవుడ్‌లో ఎగిసిపడుతున్న ‘‘మీ టూ’’ ఉద్యమంపై ఆమె స్పందిస్తూ... బాలీవుడ్‌లో పురుషాధిపత్యం అలాగే స్త్రీని వక్ర దృష్టితో చూసే మనస్తత్వంతో మహిళల ఆత్మస్థైరాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసు నుంచి తనను తప్పుకోవాల్సిందిగా బెదిరింపులు వస్తున్నాయని దీనిపై ఇక మౌనంగా ఉండనని రాధ స్పష్టం చేశారు.

భారతీయులు ఇప్పుడిప్పుడే విస్తృతంగా ఆలోచిస్తున్నారని...రాధలాగే విదేశాల్లో ఉంటున్న భారతీయులు, విదేశీయులు దేశంలో పెట్టుబడి పెట్టాలని భారత ప్రభుత్వం కోరుకుంటోందని రాధా భరద్వాజ్ న్యాయ సలహాదారు సృష్టి అన్నారు. ఈ కేసులో న్యాయం జరిగి భారతీయ సినీ రంగంలో అందరూ ఒకటేనని రుజువుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఈ వివాదంపై రాధా భరద్వాజ్ భర్త స్పందిస్తూ... పబ్లిసిటీ విషయంలోనూ ‘‘ మిషన్ మంగళ్’’ తమను కాపీ కొట్టిందని ఆయన విమర్శించారు. తమ సినిమా ‘‘స్పేస్ మామ్స్’’ గురించి సెప్టెంబర్ 8,2018న ప్రపంచానికి తెలిపామన్నారు. ఇందులో తాము వెల్లడించిన అంశాలనే నవంబర్ 12, 2008న అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారని స్పష్టం చేశారు.

అక్షయ్ వాడిన ప్రతి పదం, భావం అన్ని తమ ప్రకటనలోనివేనని ఆయన తెలిపారు. మంగళ్‌యాన్ విజయవంతంగా కక్ష్యలోకి చేరిన తర్వాత ఆ ప్రాజెక్ట్‌లో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలు దిగిన ఫోటో తన భార్యను ఆలోచింపచేసిందని.. దానికి పర్యవసానమే ‘‘స్పేష్ మామ్స్’’ సినిమా అన్నారు.

రాధ మార్స్ వృత్తాంతంతో సినిమా తీస్తాను అన్నప్పుడు.... ఆమె కళ్లలో తెలియని ఆనందం, భారతదేశం పట్ల, మహిళల పట్లా ఆమెకున్న గౌరవం తెలిశాయన్నారు. చిత్ర నిర్మాణం కోసం బ్యాంక్‌లో దాచుకున్న సొమ్ముతో పాటు ఇంటిని కూడా తాకట్టుపెట్టామన్నారు. 

స్పేస్ మామ్స్ సినిమా భారత్‌లోని అన్ని వర్గాలను, కులాలను, మతాలను ఆకట్టుకుంటుందని.. తమ దేశం పట్ల వారికి గౌరవాన్ని పెంచుతుందన్నారు. భారత్‌లోని చిన్నారులకు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్ నేర్చుకునేందుకు ఉత్సాహం చూపిస్తారని.. ప్రాచీన, ఆధునిక భారతదేశంపై ప్రపంచానికి తెలిసి వస్తుందని రాధా తనతో చెప్పిందని ఆయన అన్నారు. 

మంగళ్‌యాన్ సినిమా కోసం తాను ఇస్రో మహిళా శాస్త్రవేత్తను కలిసి.. వారి నుంచి ఎన్నో తెలియని విషయాలను నేర్చుకున్నానని రాధా అన్నారు. ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ నటులు సర్ డెరెక్ జాకోబి, అలెన్ రిక్‌మన్, అలాగే అస్కార్ విజేత జారెడ్ లేటో నటించారన్నారు.

మార్స్ ఆర్బిటర్ మిషన్‌కు సంక్షిప్త వాఖ్యమే ‘‘మామ్’’ అని రాధా వివరించారు. ఇండియాలోని తల్లులు విధులు నిర్వర్తిస్తూనే, ఇంటిని కూడా బ్యాలెన్స్ చేస్తున్నారని ఆమె కొనియాడారు. రాధ గతంలో రాసిన  ‘‘క్లోసెట్ లాండ్’’ స్క్రీన్‌ప్లేకు ఆస్కార్ అవార్డుల కమిటీ ఆధ్వర్యంలోని అమెరికా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ వారి ‘‘నికోల్ స్క్రిన్ రైటింగ్ అవార్డ్‌’’ వరించింది.

అలాగే మరో రెండు స్క్రీన్‌ప్లేలు ‘‘ఫైనల్ బోర్డింగ్’’, ‘‘డెలిహ్’’లకు అమెరికా రైటర్స్ గిల్డ్‌ వారు తమ ‘‘ఫిచర్స్ యాక్సెస్ ప్రాజెక్ట్’’లో  స్థానం కల్పించారు. అలాగే రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా, డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా రెండింట్లోనూ రాధా భరద్వాజ్ సభ్యురాలు.